Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నా అడుగుల వెనక
మా తండ్రి అడుగులు
మా తండ్రి వెనుక
మా తాత అడుగులు
ఒకరి అడుగులు ఇంకొకరికి
మడమ తడబడని రాజ మార్గం !
మన ముందు వారి అడుగుల పై
మనం అడుగు పెట్టి నడుచుకునుడే
కాదు - సులభంగా పరుగెత్తుతూ పొవచ్చు
కాళ్లకు ఎంత బలమో
భవిష్యత్తు ఎత్తైన టవర్ గా
దష్టి దోషం లేని మార్గ నిర్దేశం !
మన ముందు అడుగులను నిర్లక్ష్యంగా
పక్కకి దుమ్ములోకి తోసేస్తే
మన కంట్లోనే మట్టి మట్టి
చీకటిగా తోచని తప్పి పోయిన దారి
తొవ్వ దొరకని అగాధం గాథ
అడుగు చిన్నదే కావచ్చు
అడుగులో ఎన్నెన్ని అనుభవాలో
నీతి చంద్రికలుగా తరాల పాఠాలు
ఒక్క అడుగులో నిక్షిప్తం
ఇప్పడు మన పిల్లలకు
మన అడుగులే దిక్సూచి !
దేశ దేశాలలో మేధస్సుతో
భూగోళమంతగా విశ్వమానసం
పిల్లల అడుగు ఇప్పుడు విమానం
ప్రపంచంలో నాకు
గ్రంథాలు గ్రంథాలుగా
అడుగులే కనిపిస్తాయి
పైకి ఉద్గ్రంథం
లోపల పేజీలు పేజీలుగా
ముందు వెనుక అడుగులే అడుగులు
మధ్యలో ఖాళీ లేకుండా !
చదువుతున్నప్పుడూ రెపరెపలుగా
పేజీలన్నీ అడుగుల చప్పుడే
అవును ! ఆకాశంలో అడుగు విమానం
ఒడిలో మన చేతుల నిండా
''అడుగు''సహస్ర పేజీలుగా
మలిగి పోని ముద్రలుగా అడుగులే అడుగులు
అడుగండి ! అడుగుల గురించి
ఆగకుండా ఎంతో చెప్పగలను !
- కందాళై రాఘవాచార్య
8790593638