Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంటి ఎనకాలవుండే పెరడు లేదు.
వీదుల్లో వుండే రచ్చబండ లేదు.
ఇంటి చుట్టూ హద్దులు గీసిన..
గోడలు మోలుస్తున్నాయి.
మనిషికీ మనిషికీ మధ్య అహంకారాలు మొలిచినట్లు.
ప్రేమగాపిలిచే మాటల్లేవు ఇపుడు.
సహాయం చేసే చేతుల్లేవు.
ఊరిపుడు ఊపిరిలేని జీవై జీవిస్తున్నది.
ఊరి పొలిమేరలన్ని ఒకప్పుడు పచ్చని రామచిలుకలు.
మామిడి చెట్లకింద గోళీలు ఆడుకున్న ఆనవాళ్లు..
అటువైపు వెళ్లినప్పుడల్లా నన్నుచూసి...
ఏడుస్తూ పలకరిస్తున్నాయి పాత జ్ఞాపకాలు.
కూనపెంకల కింద సేదతీరిన క్షణాలన్ని ఆవిరైపోయాయి.
గతాన్ని తవ్విచూస్తే అస్థిపంజారాల్లా మిగిలిపోయిన
నా ఊరి ప్రేమంతా మట్టిలో కలసిపోయింది.
అభివద్ధిమాటున అంధకారంలోకి వెళుతుంది నా ఊరు.
కోతికొమ్మచ్చి ఆటల్లేవు.
నల్ల బొగ్గులతో గీసే కోయిలాల గీతల్లేవు.
బతుకంత నల్లని మసిబూసినట్లు మసకబారింది.
తొక్కుడుబిచ్చల్లేవు..గిల్లిదండల్లేవు.
దాక్కుని ఆడుకునే దాగుడు మూతల్లేవు.
మనుషుల వెనకాల దాక్కుని...
వెన్నుపోటు పొడిచే దొంగ దెబ్బలకు కొదవలేదిపుడు.
చరవాని చేతిలోకచ్చి.. కొత్తనాగరికతను నేర్పి..
ప్రేమతీగలబందాలను తెంచివేస్తున్నది
మన ఊరిపుడు మారిన ఊరు.మారుతున్న ఊరు.
చిగుగురిస్తున్న చింతపూత చింతపడుతున్నది.
పూస్తున్న మామిడిపూత మనసు నిలకడలేక
రాలిపోతున్నది.
జిట్టినేరేడివండ్లు దిగులుపడుతున్నయి.
పంటపొలాలన్ని ఒంటరై కన్నీరుకారుస్తున్నయి.
భూములన్నీ భూబకాసురుల పెద్దపులుల చేతికిచిక్కి..
బక్కసిక్కిన జింకలై గుబులుపడుతున్నయి.
ఊరి పొలిమేరలను ఆనుకొనివున్న ఆప్తులన్నీ
బాధపడుతున్నయి.
మారిపోరున్న ఊరుని చూసి.
కన్నఊరు రోజు కల్లోకచ్చి పలకరిస్తూ ఉంటుంది.
బాగోగులను యోగక్షేమాలను ఆరాతీస్తూ.
అవన్నీ గుర్తొచ్చినపుడల్లా కన్నీరుతో కాలక్షేపమే ఇపుడు
-అశోక్ గోనె, 9441317361