Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గులాం అలీ గొంతు
ఒంటరితనపు నిర్వచనం ఇస్తుంటే...
''సన్నాటా''...గుండెను కోసుకుంటూ పోతుంది.
కొమ్మ ఒకటి ఆకులతో ఊసులేకుండా ....
నిశ్శబ్దంగా గాలిని నెమరువేసుకుంటూ ఉంది.
దూరంగా పిట్ట ఒకటి...
తన గుండెచప్పుడుకు
గుబులు పడుతూ....
కదలకుంది.
చల్లని మేఘం...
ఒంటరిగా...
నీరెండను తాకకుండానే తేలిపోతూ ఉంది.
ఇప్పుడు...
ఆ నది కూడా..
కదలికలు నిషేధించి,
నిశ్శబ్దాన్ని ప్రకటించి, నిలబడింది.
ఉదయం...
జొన్నకంకె
పాలు నింపుకోవడం ఆపి,
గడ్డకట్టుకున్న బిందువువైపే చూస్తూ ఉంది...
లంగరులేని పడవ నదిపై తేలుతూ ఉంది...
అప్పుడప్పుడూ.... ఇలా ''తనహాయీ''...
దిగులు తెరలుగా కమ్ముతూ ఉంటుంది...
శూన్యంలో ఒంటరి నక్షత్రపు కాంతిలా...
- సీహెచ్. ఉషారాణి, 9441228142