Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాన్న అడుగుల్ని కదిపితే
పంట వైపే సాగేవి
కలల సాగు చేసాక
పంటను పాపాయిలా తడిమి
తన శ్రమతో
పాలకంకిని చేసేవాడు
కంకులు నిటారుగా నిలబడితే
ఊరి గువ్వలు
మా చేను నేస్తాలయ్యేవి
చేనంతా పచ్చదనంతో ప్రజ్వరిల్లుతుంటే
చిరుగాలి చక్కని జావళీలను ఆలపించేది
ఆశలన్నీ పంటయ్యాక
కంకులు..., కొడవళ్లై
నాన్న దగ్గరున్న దారిద్య్రాన్ని
తెగ నరికేలా నవ్వుతూ తలలూపేవి
పంటను జూస్తూ
నాన్న మది ఆకాశమంత
సంబరంతో మురిసేది
నాన్న ఎన్ని కలల్ని
తకపాగగా చుట్టాడో
అంకెలన్నీ కంకులై
నాన్న ఆశలకు ఆసరాగా నిలిచి
నాన్న వెన్నును నిటారుగా నిలిపి
నవ్వుతున్నట్టే కనిపిస్తాయి
నాన్న నవ్వుతో జత కలిపి....!!
- మహబూబ్ బాషా చిల్లెం,
9502000415