Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీరు నన్ను చరిత అట్టడుగు పుటల్లోకి
నెట్టే దాచేసే ప్రయత్నం చేయొచ్చు
అనుమానాలతో అవమానాలతో
నా జీవితాన్ని బంధించి
బెడ్ రూమ్ కు కిచెన్ కు మధ్య
చిలువలుపలువలుగా
విస్తరింపజేయొచ్చు
పురుషాధిక్యతను
నిరూపించుకునే ప్రయత్నంలో
పురుగులుగా మారి
నా కడుపులో చొరబడి
నా చీమూ నెత్తుర్లను ముద్దలుగా జేసి
మీ భుజాలపై వేసుకొని ముద్దాడొచ్చు
ఎప్పుడూ భూమిలా నవ్వే
నా నవ్వును తట్టుకోలేక
ఆంక్షల కత్తులతో కట్టుబాట్ల గొడ్డళ్లతో నా వ్యక్తిత్వాన్ని
ముక్కలు ముక్కలుగా చేసి
సంబరపడుతున్నప్పుడు
ఆటమస్ గా మిగిలిన నా అస్తిత్వం
బ్రహ్మాండం దాకా నిండిపోతుంది
అంతే ఇక
నన్ను చూసి పారిపోయిన పురుషాహంకారం
నిశబ్దం నీడలో దాక్కొని మరుగైపోతుంది
నా ఆత్మవిశ్వాసాన్ని
గర్వమనుకున్న జాతి జాతంతా
సూటిపోటి గా నన్ను పొడుస్తూ
చుట్టూ మూగుతుంటే
నా ముందరున్న అమావాస్యను తుడిచేసి
నిండు పున్నమిలా వెలుగుతాను
(మార్చి 8 ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా....)
- డా. చింతల రాకేశ్ భవాని 9246607551