Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేనైన నేను..
నీవు కాని నీతో మాట్లాడుతున్నాను.
కొంత అర్థమయ్యి,
కొంత అర్థంకాక
కనబడే నీకు..
పూర్తి అర్థాన్నిచ్చే వాక్యంలాగా
వినబడుతుంటాను.
అపుడే కనిపించి,
అపుడే మాయమయ్యే
ప్రశ్నలాంటి నీ దశ్యానికి
జవాబు లాంటి అద్దంలా
కనబడుతుంటాను..
అది అలా ప్రారంభమైందని
అలాగే కొనసాగుతుందని
ఇది ఇలా ముగిసిపోయిందని
నువు నిరాశతో ఊగిసలాడినప్పుడు..
కాస్త ఊరటనిచ్చే ఉత్సాహంలాగా
నీలోకి తొంగిచూస్తుంటాను..
చూస్తున్నది కనబడడంలేదని
చెబుతున్నది వినబడడంలేదని
చదువుతున్నది అర్థంకావట్లేదని
నువ్వు అసహనాన్ని అలుకుగా
అంతటా చల్లినప్పుడు
నీ బతుకువాకిలి ముందు
చిరునవ్వుల ముగ్గులా
పరచుకుంటాను..
మంచుతో పేరుకున్న
నీ మౌనానికి
నిప్పులాంటి వ్యాఖ్యానాలు
చేస్తుంటాను..
నీ పిచ్చి వైరాగ్యానికి
ముగింపు వాక్యాలు రాస్తుంటాను..
మసి పూయబడ్డ నీ మనసు కళ్ళు
తెరుచుకున్నప్పుడు..
నీకు..నీవే నేనులా కనబడతాను..
నీవు నీవుగా
నిఖార్సయిన మనిషిలా
నిటారుగా నిలబడినప్పుడు..
నీలోని నేను
నీవైన నన్ను
హాయిగా చూసుకుంటాను..
- తిరునగరి శరత్ చంద్ర
6309873682