Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక ఉదయం
గడియారాన్ని ముఖానికి అతికించుకుని
హడావిడిగా రోడ్డు దాటుతున్నప్పుడు
ఆమె తళుక్కున మెరిసింది
కళ్ళచూరు నుండి జారిన
ఒక్క పలకరింపు చినుకు
హదయంలో
ఎన్ని వేకువలను రగిలించిందో
చిన్నప్పుడు
కలిసి ఆటలాడుకున్న వసంతం
ఎన్నేళ్ల తర్వాతో
మళ్ళీ ఇలా..
వెన్నెలింకా మిగిలేవున్నా
హఠాత్తుగా మనసు మార్చుకుని
పొద్దుచీకటిలోకి ఇంకిపోయిన
చందమామను చూసినట్టు
చప్పున నేనో
ప్రశ్నార్థకమయ్యాను
రేపటి లేత కల ఏదో
ఆమె చిటికెనవేలి చివర అల్లరి చేస్తుంటే
కళ్ళతోనే
అప్పటికప్పుడొక ఉత్తరం రాసి
నేను చూడాలని కాబోలు
ఫుట్ పాత్ కి అతికించి వెళ్ళిపోయింది
ఒక సాయంత్రం -
చెమట గాలికి
పాపిట లోయల్లోంచి సింధూరం ఒలికిపోయాక
మిగిలిన ఎడారి లాంటి నుదురుతో
ఆమె మా ఇంటి కొచ్చింది
కూరగాయలు కోస్తూ
చటుక్కున వేలు తెగినట్టు
నాలో ఎక్కడో ఓ నరం తెగింది
ఇంటి దీపంతో పలకరింపులయ్యాక
నుదురు దగ్గర ఆగిపోయిన
నా చూపుల చిక్కు ముడిని తీరిగ్గా విప్పింది
అనుమానం ఎర్రటి కొసలు తాకి
కమిలిన గుండెను చూపెట్టింది
కన్నపేగు మెడ చుట్టూ ఒరుసుకున్న
కన్నీటి గతాన్ని తవ్విపోసింది
వత్తాసు పలికిన సాటిఆకాశాల
చీలిన నాల్కలకు
నాదగ్గరేమైనా పేరుందా అని ఆరా తీసింది
ఆ క్షణం ఆమెలో
ఒక్క అలైనా కదల్లేదు
పూర్తిగా గడ్డకట్టుకుపోయిందా?
ఐనా
జీవితం ఎంత పిరికిది!
పిడికెడు తెగింపుముద్దను పడేస్తే చాలు
కుక్కపిల్లలా తోకూపుకుంటూ
కాళ్ళ దగ్గర పడుంటుంది
ఆమె గుమ్మందాటి వెళ్తున్నప్పుడు
పాదాల కింద నలిగి
నా చూపులు నక్షత్రాలవుతుంటే
సముద్రమవుతున్న
నదిని చూస్తూ నిలబడ్డాను
- సాంబమూర్తి లండ,
96427 32008