Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఛిద్రమైన
బతుకు దాహపు అడుగు
నెత్తురుమంచుబిందువుల
గులాభిరెమ్మలు
మట్టిరేణువుశిలాజాలు
కొన్ని కన్నీళ్లు
పక్షిఈకలగౌను చిరిగిపోయి
చితికి చెదిరిన
లేత నవ్వుల పుప్పొడి
విరిగి కుప్పకూలిన ఆర్తనాదాలు
అనేకానేక క్షణాలు
పరుగుతీసి పరుగుతీసి
ఒరుగులైన నీడల గుర్తులు
తడి నెత్తుట్లో కూరుకు పోయి
మరణించిన
తెల్లరెక్కల సీతాకోకచిలుకలు
ఇక్కడొక
జీర్ణాశయం నిండా
ఇనుపశకలపు ముద్ద
శిశిరపు చింత చెట్టు
రాల్చిన ఆకుల్లా
నేలకప్పుకున్న అవయవాలు
దుఃఖం బిగుసుకున్న
తెగిపడిన గొంతు
అక్కడొక
రొట్టెముక్కలో
ఇరుక్కుపోయిన తూటా
ట్యాంకర్ల కింద ధ్వంసమవుతున్న
చెమటచుక్కల ధ్వని
దుమ్ము పడుతున్న ఆఖరి శ్వాస
ప్రాణాలు కమురుతున్న
మనిషి వాసన
కాలం
అజీర్ణక్రియ బాధ పడుతోందిప్పుడు
- వడ్డెబోయిన శ్రీనివాస్
9885756071