Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తను తన బాల్యాన్నంతా
ఓ పెట్టెలో కట్టి పెట్టేసింది
ఆ పెట్టెకు తనకు ఉన్న చుట్టరికం
ఈనాటిది కాదు
నేను నా కవితలన్నింటిని
అట్టలూడిన పుస్తకంలో పోగేసుకున్నట్టు
తన చిన్ననాటి అనుభవాలన్నింటిని
చూడచక్కని ఛాయాచిత్రాలుగా చేసి
చక్కగా పోగేసుకుంది తను
నిండు చూలాలు లెక్కున్న
ఆ చెక్కపెట్టె పాతదే..
దాని కడుపు నిండా పరుచుకున్న
ఆ చిత్రాలు మాత్రం
నా కంటికి కొత్త కొత్తగానే కానొస్తున్నాయి
నేనా పెట్టెను పలకరించడం ఇదే మొదటిసారి
అందుకే గట్టిగా చుట్టేసుకుందేమో నన్ను
ఏదేమైనా....
ఆ పెట్టె ఆమెకు జ్ఞాపకాల పుట్ట
ఇప్పుడు నా మనసు చెట్టుకు పట్టిన తీయని తేనెతుట్ట!
- కార్తీక రాజు, 8977336447