Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్రంగా చేపలు ఆకాశంలో ఈదుతున్నాయి
కప్పలు అరుస్తున్నాయి కూడ
సూర్యడు చంద్రుడు నాటుపడవెక్కుతునట్టు
తడబడుతున్నారు
అర్థమయింది
ఆకాశాన్ని కత్తిరించి
ఎవరో ఊరి చెరువులోకి విసిరేసినట్టున్నారు
నిత్యం చీకటిని నెమరేసే నాకు
వెన్నెల కొంచెం చేదుగా అనిపిస్తుంది
వేడి సెగల మధ్య వత్తిగిల్లడం అలవాటు కదా
శీతలం ఉక్కబోస్తుంది
నాతో నాకెప్పుడూ ఘర్షణే
కొద్ది కొద్దిగా తెలుస్తునే వున్నప్పటికీ
సౌకర్యాల చట్రంలోకి
అసౌకర్యంగానే నెట్టబడుతున్నాన్నేను
ఇంతకు ముందు వరకూ
ఇక్కడొక లోకం వుండేది
అప్పుడప్పుడు నేను లోకం నుంచీ
నానుంచి కూడా తప్పుకు తిరుగుతుండేవాడిని
ఎవరూ వెతకడం
ఎదురుచూడటం కనపడనే లేదు
నాకు కావల్సిందీ అదే
ఇప్పుడు నేను ఒంటరిని
పెనుగులాటలేని ప్రవాహాన్ని చూడు
కొండలమీదగా దూకుతున్న జలపాతాన్ని చూడు
దయచేసి విఘాతం కలిగించకు
ఎప్పటినుంచో ఎవరికీ తెలీకుండా కలగంటున్నాను
అక్కడ ఒక పొంతనలేని పాట మొదలవుతుంది
కలల వసంతం కాలిపోవడమూ కనిపిస్తుంది
ఉసిరాకు విస్తరిలో భోంచేస్తూ
చింతాకు చాపమీద నిద్రిస్తూ
ఎప్పటి నుంచో
విరుద్ధాలను సరిదిద్దడం కోసం
ఒక కలగంటున్నాను
- బంగార్రాజు, 8500350464