Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రియా....
తడి ఆరని నా కనుపాపల మాటున
మసకబారిన నీ రూపం దాగివుంది...
తెల వారని నా ఆశల వాకిట
దరిచేరని నీ తలపు నిలిచి ఉంది...
గుండెనిండా జ్ఞాపకాలు నింపుకోని
మది నిండా వ్యాపకం పొదుపుకుని
నీకు దూరమై ఒంటరిగా బ్రతికేస్తున్నా
నీవిక చేరువ కావని....
రాధిక వసంత మాసమని!
ఈ చీకటి పయనంలో
గుండె బరువై, మనసులో గుబులై,
మమత కరువై, ఎద ఏడారై
నీవు తోడు లేకున్నా.. కనులకు కనబడకున్నా,
ఉఛ్వాస నిచ్వాసలే నీవై..
భారంగా సాగిపోతున్నాను...
నీకోసం
నీకోసమంటే నీకోసం
నేను నిర్మించుకున్న నీ స్వప్న సౌధం...
ఎంత అపురూపమైనదైతే ఏమిటి?
జీవితమంతా ఉప్పెనలూ.. సుడిగుండాలేకదా!
వీటి మధ్య ఈ స్వప్న సౌధం ఎంతకాలం నిలుస్తుంది.?
ప్రియా! నువ్వే నేననుకున్నా
నా నవ్వే నువ్వనుకున్నా
కానీ! వాగ్దానాలన్నీ మరిచి, చేసిన ప్రమాణాలన్నీ విరిచి
వేలాది ఘర్షణలూ, గాయాల తర్వాత
ఎదురీత తెలియని నన్ను
కన్నీటి తుపానులో వదిలేసి..
ఒకరి కన్నీళ్లు ఒకరం తుడుచుకోకుండా
వెంట రాలేనంత దూరంగా వెళ్లిపోయావు.
ఎంత నిర్దయ నీకు?
ప్రాణం లేని శిలలమై
కాల ప్రవాహంలో శిధిలమై
నేను నువ్వుగా ఆవిష్కతమయ్యే అవకాశం లేని
ఒక అజ్ఞాత చరిత్రగా మిగిలిపోదాం.
ఎపుడో అపుడు కలిసినప్పుడు
బాగున్నావా అంటే...! ''ఉన్నాను''
అని మాత్రమే ఒకరితో ఒకరం చెప్పుకుంటూ...
అంతేగా? పరవాలేదులే..!
ఏడవగలిగినవాడే... ఏడిపించగలడు కూడా..
అన్న నిజం ఇద్దరికీ తెలిసిందేగా...!!
- పొన్నం రవిచంద్ర,
9440077499