Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎర్రనిజెండాలెగరేద్దాం
నింగిన చుక్కలు నవ్వేలా
శ్రమదోపిడినీ ఎదిరిద్దాం
శ్రామికలోకం మురిసేలా
పదండి శ్రామిక సోదరులారా
పదండి కార్మిక కర్షకులారా...
మేడే వర్ధిల్లాలీ... మేడే వర్ధిల్లాలీ...
పోరాడి సాధించుకున్నము
ఎనమిదిగంటల పనివిధానము
ప్రాణాలెన్నో బలి ఇచ్చాము
చెమట చుక్కల హక్కుల కోసము
వీరుల త్యాగం తుంగలతొక్కి
కార్మికయోధుల గొంతులు నొక్కి
చట్టాలను మార్చేస్తుంటే
బతుకులను బలి చేస్తుంటే
సుత్తీలెత్తిన చేతులతోనే
ఎర్రనిజెండాలెత్తాలే...
మేడే స్ఫూర్తి గుండెల నిండగ
పోరుజాతరై నడవాలే...
జాతీయోద్యమ ఆశల రూపం
స్వతంత్రభారత ప్రభుత్వరంగం
స్వావలంబన సాధించిందీ
దేశసంపదై వెలుగొందిదీ
నరేంద్రమోడీ గద్దెనెక్కి
ఆ కంపెనీలనూ అమ్మేస్తుంటే
చేతులు ముడుచుకు చూస్తే ఎట్లా పిడికిల్లెత్తీ లేవాలే...
దేశ సంపదను కాపాడంగా సింహాలై గర్జించాలే...
సంఘం పెట్టే హక్కు లేదనీ
చేతికి సంకెళ్లేస్తుంటే
సమ్మెహక్కుపై ఉక్కుపాదమై
తొక్కిపెట్టగా చూస్తుంటే
ఆదానీలూ అంబానీలూ
దేశమంతటిని మేస్తుంటే
ఈ నయవంచకుల మెడలు వంచగా
పోరుకు కొడవలి నూరాలే...
మోడీపాలన గోరిగట్టగా ఊరువాడ బైలెల్లాలే....
- కాకం అంజన్న
సెల్: 9701747407