Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరిది
అచ్చం నా నీడలాగే వుంది
నా నరాల్లో రక్తమై పారుతున్న కవిత్వం
కొద్దికొద్దిగా చెదల కొరుక తింటూ....
నా నుంచి దూరం చేయడానికి,
బలంగా కవిత్వాన్ని శూన్య పరచడానికి
అచ్చం నా నీడలాగే వుంది-
మిత్రవాక్యంలా తోడుగా ఉన్నట్టు ఉంటూ
శుత్రుముఖితో రహస్య జాడ తడుముకుంటుంది-
కవిత్వం లేకుంటే నేను లేను కదా!
బహుశా కవిత్వం దూరం చేయడానికి
అచ్చం దేశభక్తి గీతంలా
బుల్డోజర్ ఎక్కి కొత్తపాట పాడుతుంది!
మట్టికి ఏదో స్పర్శ రంగులు అద్దుతుంది!
జాతి జెండానే
సర్పం శిరస్సు మీద కొత్తగా
నా దేశం చిత్రపటం గీసుకుంటుంది-
ఇప్పుడు అన్ని కొత్త కొత్తగానే; నా నీడలోనే...
శకలాలుగా తెగి, ఒంటరిగా మిగిలిపోయే
ఒకానొక ఫాసిజం కాలం చీకటి సుడిగాలి
వెలుగుగానే కనిపిస్తున్నట్టు...
అచ్చం నువ్వు నువ్వుగా... నేను నేనుగా...
ఒక రోజు శవ వార్తలో... యాత్రలో...
తడిఆరిన పొడిపొడి మాటలు వెతుక్కుంటూ...
నవ్వుల్ని పులుముకుంటూ....
మళ్ళీ
సుడిగాలిలోకి...
ఒక రోజులాగే కరిగిపోతుంది!
- జనజ్వాల,
9949163770