Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రేయనక పగలనక
ఆరుగాలం పడ్డ శ్రమను అపహాస్యం చేసి
బొక్కలెల్లిన మాపై ఉక్కుపాదమై
మీరు తొక్కనీకి జూస్తున్నరు
వడ్లు కొనమని ఒకడు
నూకలు తినమని ఇంకొకడు
రోజూ ఎగతాళి జేస్తున్నరు
మా తాతల ముత్తాతల నుంచి
మావి ఎండిన బతుకులే
నూకలు తినడం మాకు కొత్తేమి కాదు
శాన్నాళ్ళ నుండి గంజి నీళ్లు తాగుతు
బతుకులెల్లదీస్తున్నం
ఇగో ఇప్పుడిప్పుడే నాలుగు గింజలు పండిస్తూ
పచ్చ పచ్చగైతున్నం
మారుతున్న మా బతుకులల్ల
నిప్పులు పోసుడెందుకు?
చూసి ఓర్వలేని మీ చూపులెందుకు
కండ్లల్ల మమ్ముల ఆరి పోసుకునేదెందుకు?
జెనిగల లెక్క మా రక్తాన్ని పీల్చుడేందుకు?
మా రెక్కల శ్రమనంతా నంజుకుని
జుర్రుకు తింటున్నరు
ఇంకానక కారు కూతలు కూస్తున్నరు
శెవులు సిల్లులు పడేలా
పెడబొబ్బలు పెడుతున్నరు
మీరెన్ని అడ్డంకులు సష్టించినా...
ఆగాథంలోకి నెట్టేస్తున్నా...
ఓరిమితో సహిస్తున్నం
మీరూ మా వాళ్లేనని భరిస్తున్నం
జై కిసాన్ అన్న సంగతే మర్చినరు
రైతే దేశానికి వెన్నెముక అన్న
సోయే విడిసినరు
యేరాండ్ల లెక్క కొట్లాడుతున్నరు
మేము కర్షకులం,మట్టిలో పుట్టిన వాళ్ళం
మేము గరీబులమే కావచ్చు కానీ,
శేమట సుక్కలు ధారపొస్తున్నోలం
దేశానికి ఇంత అన్నం పెడుతున్నం
మేమే గన్క ఎదురుతిరిగితే
తోకముడిచే పిల్లులు మీరు
మా తాకిడికి తట్టుకోలేని
చిగురుటాకులు మీరు....
గత అనుభవం నిరూపితం... ఖబర్దార్!
మీరూ మీరూ ఒక్కటే...
పండుగలు పబ్బాలల్ల ఒకరికొకరు
పంచుకు తిన్నోళ్ళు, ఆలింగనం జేసుకున్నోళ్లు
మీరు రోజూ... ముదనష్టపు
రాజకీయ రంకులల్ల తేలుతున్నరు
మేము మా బతుకులీడ్స్కుంట
పిట్టలోలే రాలుతున్నం
ఐనా.. మీ శెవులకు మా గోస వినబడదు
జర సైసు.. ఎన్నికలప్పుడన్నా
మా తడాఖా చూపిస్తం
మీ లెక్కల సంగతి సుత
బరా బర్ జల్దే తేల్చతం
ఇగ కాసుకోండి!
- కోమటి రెడ్డి బుచ్చిరెడ్డి,
9441561655