Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకాండలూ
సుందరకాండలూ ముగిసిపోయాయి
దేశంలో ఇప్పుడు గురివిందకాండ నడుస్తుంది!
దేవుడుగా చలామణి అవుతూ
దేవుణ్ణి నేను కాదు ఇంకొకరున్నారనటం
నేనే దేవుడ్ని
సమస్త జీవజలాలూ
నాలో నిక్షప్తమై ఉన్నాయన్న నిజానిజాలూ
నేతిబీరలో నెయ్యిలాంటిదే
మనిషిలోని మనిషితనం కోసం
మనిషి దేవులాడితే బాగుణ్ణేమో!
ఎర్ర సముద్రం రెండుగా చీలడం
యమునా నది దారి వదలడం
ప్రెయర్ ఆయిల్ పవరెంతుందో
విభూతి నీళ్ళ మహత్తు ఏమిటో
నమ్మినోడికి నమ్మినంత
కష్టపడందే కడుపు నిండదన్నది
ముమ్మాటికీ నిజం కదా!
మెడలో పుర్రెల దండ
వంటికేమో వందల చేతులు
దేవుడంటే ఇలా వుండాలా
మూడు చేపలూ ఐదు రొట్టెలూ
ఐదువేల మందికి పంచివ్వడంలో
కనికట్టేమీ లేదనాలా?
కామధేను కడుపంతా వెతికినా
కనిపించేది శూన్యమనాలా
ఇంటావిడ మీద కోపం వస్తే
ఒక్కమాటతో వదిలెయ్యాలా
ఏమిటో వింతగోల అంతా మనుషుల లీల!
నువ్వు పెట్టేది దేవుడు తినడు
దేవుడు నీ నోటికివ్వడు
ఆకటికి అలమటించే ప్రాణం
అడుగుడుగున కనిపిస్తుంది కదా?!
చచ్చిపోయి తిరిగొచ్చిన దేవుల్లారా
మా తాతల్ని బతికించండని
అడగండి చూద్దాం!
నా దేవుడు గొప్పంటే
నీ దేవుడు తుప్పంటూ
మచ్చల కోసం సెర్చింగ్లో వుంది దేశం
అబద్ధ నిజాల నిజ అబద్ధాల బిగ్ డిబేట్లో
దేవుడు సంగతి దేవుడెరుగు
మనిషన్నోడు నిజమని నిర్ధారిస్తారో లేదో!
వాళ్ళకు చెప్పండి
సర్వమత సారం ఒకటే సర్వాంతర్యామీ ఒకడే
నమ్మం కుదరకపోతే
అసలు దేవుడే లేడని ప్రకటించండి!
(ఒకరి మతం గొప్ప, మరొకరి మతం తుప్పు అంటూ
తిట్టుకుంటున్న చాలామంది మనుషుల కోసం)
- బంగార్రాజు,
సెల్:8500350464