Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంకా
ఈ గాయాల చరిత్రని చదవాలని లేదు
ఈ లోయల దారులేంటా నడవాలని లేదు
నా వారసత్వ నెత్తుటి ముద్దల్నిచూడాలనిలేదు
గతం పేజీలు తిరిగేసినపుడల్లా
కన్నీళ్లు పేరాల ధారలై వెక్కిరిస్తున్నయి
అడుగు మోపినపుడల్లా వాళ్ళ
గుంజి కట్టేసిన కాళ్ళు నిక్కి చూస్తున్నయి
ఇంకా ఈ విషం నిండిన తోకల వెంటా
వెళ్లద్దని హెచ్చరిస్తున్నయి
అన్నం బెట్టిన చేతులు
ఎండలో చల్లముంతలై దూప లార్పిన చేతులు
నిబద్దతా నిజాయితీ తినిపించిన చేతులు
స్పహ తప్పిన మొఖానికి
నీళ్లు చల్లి కండ్లు తెరిపించి
నీటారుగా నిలబెట్టిన చేతులు
చీమకు చిరు ప్రాణికి
కులం మతం అంటని మానవత్వపు
చందనాన్ని అద్దిన చేతులు
నల్లకలవల కండ్ల తల్లులు
వీరుల్ని కన్న కళావతులు.
వెంటాడి వేటాడి ఎర్ర పులులకు
నెత్తుటి కూడైన వంశ వీరులకు
ఇంకా
దీపాలు పెట్టి తలలకు నిప్పుపెట్టి
అవమానాల మసి పుయ్యడం హీనాతి హీనం
గుడ్డునుంచి వెలుగుకొచ్చి
గుడ్లు తెరిచిన పిల్లల
పచ్చముక్కులు నలిపెయ్యడం దుర్మార్గం
చిగుర్లు తింటూ చిరుపదాలు పలుకుతూ
అప్పుడే రాగాలు చప్పరిస్తున్న గొంతులకు
నిషేధపు స్టిక్కర్లు మెత్తడం ఎంత విషాదం.
చెమట దారులు పారించి
దండల కండలు తీసి ఒడ్లు కట్టి
నారుమడి పరిస్తే
ఎవరో నదులు దాటి నాగలోకం దాటి
విషపు గింజలు అలికి
నన్ను పరాయి పక్షిని చేశారు
తల లేనోళ్ళు కిరీటాలతో ఊరేగడం
కుర్చీ కాళ్లకు సరి తూగనోడు
కాలు మీద కాలేసి పేడి మూతిని
పీక్కుంటూ వెలివేయడం...
వాళ్ళ చూపులెప్పుడూ పాసంగం ముల్లును
మధ్యలో నిలువ నియ్యవు
వాళ్ళ చిల్లుల చెత్రి కింద
మాటను చంపుతున్న మోకాలు కింద
ఇంకా ఎంత కాలమని వంగిన వీపుల మైదాం
ఇక సమయం లేదు సందర్భం జారిపోతే రాదు
రండి!!
పాయలుగా చీలిన మనం
పోటెత్తిన వరద మౌదాం.
- డా. ఉదారి నారాయణ, 9441413666