Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దుకు నడక నేర్పే
చల్లని అడుగు
కాలం పరీక్ష పెట్టినా
వెనుకంజ వేయని
నిరంతర ప్రయాణం...
పంట చేల చుట్టూ అల్లుకునే
ఆలోచనల సవ్వడిలో
అతనిది ఆకలి తీర్చే అమ్మతనం
తనకేమి మిగులుతుందని
కాదు చింత
మళ్ళీ వేయబోయే పంటకి
పెట్టుబడి కోసం కలవరింత...
పంట పొలమే అతని తపో భూమి
తరతరాలుగా అతడొక మౌన ముని
నడిచే నేలనంతా
ధాన్య రాశులతో నింపాలనే
అతని దఢ దీక్ష...
రైతే రాజంటూ ఉపమానాల
గానా బజానా
ఖజానాలోని ధనమంతా
ఎవరెవరికో నజరానా...
ప్రభుత్వాలు మారినా
రైతు బ్రతుకు నిత్య గాయాల నది
పైపై మాటల మలాంతో
మారుతుందా దుఃఖ గీతపు పల్లవి..
- వెల్ముల జయపాల్ రెడ్డి,
9441168976