Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లెకు కాళ్ళుండవు
మన దగ్గరకు నడచి రావడానికి
దానికి మనసుంటది
మన కోసం ఎదురు చూస్తుంటుంది!
కారణం ఏదైనా కాని
పండగో పబ్బమో
జాతరో తీరని యాతనో
అప్పుడప్పుడు ఊరెళ్ళి వస్తుండాలి!
అది ఇప్పుడు
చివికిన గూడే కావచ్చు
ఊరెళ్ళి వచ్చినప్పుడల్లా
మన వయో భారం కొంత మాయమవుతుంది!
అన్నీ మరచి
ఒక మై మరుపుతో ఊరంతా తిరుగాడుతుంటే
ఎదిగిన మన పాదాలను చూసి
చిన్న నాటి పాద ముద్రలు మురిసి పోతాయి!
ఎన్ని భవనాలు
ఎక్కి దిగినా
పుట్టిన నేల మీద పాదం మోపినప్పుడల్లా
మనకు కలిగే ఆ పులకరింతే వేరు!
తప్పులు చేసినప్పుడల్లా
సాచిన చేతులకు సాక్ష్యం
శిథిలమైన మా పాఠశాల వరండా
నా రాకను పసిగట్టి మురిసిపోతది!
కొట్టీ కొట్టీ అలసిపోయిన
అటెండర్ కాశీం గుండె ఆగిపోయింది
ప్రార్థనా కాలం బడి గంటల ప్రతి ధ్వని
ఇంకా వెంటాడుతూనే ఉంది!
అమ్మ లేదు నాన్న లేడు
అయినా ఊరక్కడే ఉంది
వారి జ్ఞాపకాలను పదిలంగా
దాచి పెట్టిన సందూక పెట్టెలా!
ఊరు నిండా నా జ్ఞాపకాలు
నా ఎద నిండా ఊరు తలపులు
బుద్ధి పుట్టినప్పుడల్లా
అదీ నేనూ నెమరేసుకుంటూ ఉంటాం!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి,
9440233261