Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇంకా పాల బిల్లు పైసలు రాక
పాలవాడు తెల్లమొహమేస్తే,
కిరాణా బిల్లు అందక కొట్టువాడు
ఆ బాధను తట్టుకోలేకపోతుండు..
ఇంకా సారు జీతమియ్యలేదని
ధోభీవాడు భోరుమంటుంటే
సంసారబండిని అతికష్టమ్మీద నెట్టుతున్న
పనిమనిషి దుడ్లు దొరక్క విలవిల్లాడ్తుంది..
ట్రాన్స్ఫర్ ముచ్చట్ల పడి పదిరోజులైనా
ఇంటి కిరాయి మర్చిపోయాడేమోనని
కిందికి దిగగానే పట్టుకుని మరీ
ముచ్చట్లు జెప్తున్న ఇంటి ఓనర్..
ఆకాశాన్నంటుతున్నా ధరలసూచిలు
భయపెట్టిస్తున్న EMI బూచీలు
పదో తారీఖుయైన ఇంకా పడని జీతం
మల్లమల్ల ఫోన్లల్ల ఏ మెసేజ్ ఒస్తున్న
ఆత్రుతతో కళ్ళు పెద్దవౌతున్న సందర్భం..
రానురాను ఒకటో తారీఖు జీతం
ఆటలెక్కువై అటకెక్కనుంది
చివరికి దానిపేరు,
చరిత్ర పుటలోకెక్కనుంది
పాతజమానాలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో
ఒకటో తారీఖుకే జీతం పడేదని,
పాలకులు, ఉద్యోగులు సుభిక్షంగా ఉండేవారని
పుస్తకాల్లో ప్రచురించబడుతుందేమో..
చివరికి
తను ప్రభుత్వఉద్యోగో..? కాదో..?
కాంట్రాక్టో..? అవుట్సోర్సింగో..?
టైమ్ స్కేలో..? టైమ్ చెడిపోయిన వాచో..?
అని మీమాంసలో పడ్డ సామాన్య జనం..
పూర్వం ఒకటో తారీఖు జీతం కొన్ని
కుటుంబాల్ని నెట్టుకొచ్చేది
విచిత్రంగా అదే ఒకటో తారీఖు జీతం
పదో తారీఖు దాకా చేతికందక ప్రస్తుతం
కొన్ని ప్రభుత్వాల్ని నడిపిస్తుంది..
- సర్ఫరాజ్ అన్వర్,
9440981198