Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పసితనంలో కన్నోళ్ళను కోల్పోయి
నడీడులో సాదుకున్నోళ్ళను విడిచి
బతకుదెరువుకోసం 'దేశం' పోయిండని తెలిసినప్పుడు
నాన్నెందుకో నాకు నచ్చలేదు
ఆకలికి పేగుల్ని పోగులు పోగులుగా
రాట్నంతో వడికి
కండలను కండెలుగా చేసి వొంటిచేత్తో
పట్టు బట్టలను నేసిన నాన్న
పెయ్యి మీద రోజు
ఒక్కటే చినిగిన బనీను తొడుక్కున్నప్పుడు
నాన్నెందుకో నాకు నచ్చలేదు
కట్టుకున్న దానిని, పోరగాళ్ళను చూడడం కోసం
యాడాదికో రెండు యాడాదులకొక్కసారో
నోముల పండుగకొచ్చే నాన్న
మాతో నాలుగు మాటలైన
కడుపు నిండుగ మాట్లాడకుండానే
బతుకు బండెక్కిపోయినప్పుడు
నాన్నెందుకో నాకు నచ్చలేదు
మాయదారి రోగమొచ్చి
తాత మంచం మీద పడి చావొస్తే
చివరి చూపుకైనా అందుకోలేని నాన్న
కాష్టం ముందు కన్నీళ్ళు కారుస్తూ
గుండెను బాదుకున్నప్పుడు
నాన్నెందుకో నాకు నచ్చలేదు
దిన్ పైల్ రాత్ పైల్లతో
బతుకంతా సాంచెల మోత మధ్య
కొట్లాడిన నాన్న
మమ్ముల్ని 'దేశం' రాకుండా కట్టడి చేసి
సదువులతో ముడిపెట్టి సక్కని బతుకు తొవ్వను చూపెట్టి గౌరవంగా నిలబెట్టినప్పుడు
నాన్నెందుకో నాకు నచ్చలేదు
బొంబాయి భీవండీ సిరిసిల్లలో
'రాజా' బతుకు బతికానని రుబాబు కొట్టిన నాన్న
రెక్కల కష్టాన్ని మరిచిపోడానికి రోజు 'పద్యం' మత్తులో ఊగడం అలవాటయ్యాక
నాన్నెందుకో అసలే నచ్చకుండా పోయాడు
నిజం చెప్పాలంటే
కొడుకులకు ఏ నాన్నలు పూర్తిగా నచ్చనే నచ్చరు
ఎలా చెబుతున్నానంటారా..,
ఇప్పుడు నేను కూడా ఓ 'నాన్న'నయ్యాను కదా..!!
- బిల్ల మహేందర్,
9177604430