Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిన్నెందుకో అతడు రాలేదు
నల్లమబ్బు ఒంపే చీకటికి
రవికిరణపు మెరుపుకు
నడుమ జరిగే
సంభాషణల సందిగ్ధతల మధ్యన
నింగి నలుగుతోంది
ఎండిన దేహంతో అల్లాడుతున్న నేల
మేఘం ఒంపే క్షీరధారలకై
ఆవురావురంటోంది
పూలమొక్కలు తలలు వంచుకుని
మౌనంగా వాన కలను మోస్తున్నాయి
మొదలులోకి ఒలికిన నీటిని
ఎంత చప్పరించినా
చినుకుచేతుల కౌగిలింతంటే
వాటికెంత ఇష్టమో
నడివేసవి రోజున
ఎర్రని ముఖంతో
నవ్వుతూనే వేడెక్కించే సూర్యుడు రాలేదనుకున్నాను
బహుశా
క్రమం తప్పకుండా డ్యూటీ చేసి
అలసిన కార్మికుడిలా
విశ్రాంతికి తపిస్తున్నాడేమో అనుకున్నాను
బద్ధకపు చిరునామా ఎరుగని అతడు
ఈ రోజు ఉదయాన్నే
రెట్టింపు ఉత్సాహంతో
త్వరగా తయారై వచ్చాడు
భగభగలతో ముచ్చెమటలు పట్టిస్తూ
నిట్టూర్పు చితుకులు రాజేసి
నిలువెల్లా మంటలు రేపుతున్నాడు
-పద్మావతి రాంభక్త
9966307777