Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చుక్కల పై పొరను
ఎవరో వలిచేస్తున్నట్టున్నారు
ఆకాశం నల్లగా నిగనిగలాడుతోంది
క్రితం గోడకు
ఎవరెవరో వెల్ల వేస్తూనే వున్నారు
క్షణానికో రూపాన నిలబడిపోతూ
అసలు జాడను మరుగుపరుచుకుంది
కుండీలో మొక్కను
నాటిన వాడెవ్వడో ఏ ప్రపంచానికి తెలియదు
రోజూ నీళ్ళు పోయడం మాత్రం మానడం లేదు
యత్ర నార్యస్తు పూజ్యంతే
ఎన్ని నోళ్లలో నానిందో
చినికి చినికి పీలికలు అయ్యింది
గాజు తెరలు కప్పుకున్న చరిత్ర
వక్రీకరణం చెందుతూనే వుంది
వక్ర భాష్యాలతో సర్దుకుపోతూనే వుంది
ఇప్పుడు నేను
గాయపు లోతుల్లో మొలచిన స్రావాన్ని
గొంతెండిన మాటలతో ఔ
పురివిప్పుతున్న సాక్ష్యాన్ని
సమాధి ప్రశ్నల సరళికి
కొత్త భావ విపంచిని
ఐదారడుగుల దేహాన్ని యుధ్ధ భూమిని చేస్తూ
నాకై నేను తెగబడుతున్న వేదనా స్వరాన్ని
తెగిపడ్డ గొప్పల చెప్పులకు కుట్లు వేయలేక
వేడి చూపుల అడ్డదారులపై
నడుస్తున్న నిర్వీర్య పాదచారిని
అస్ఖలిత స్త్రీత్వతత్వాన్ని
నేనెప్పటికీ
అనాదిగా ఆమెని
మతాన్ని మోస్తున్న దేహాన్ని
మలినాలు రుద్దబడ్డ
మనసు పొరలతో
కాయం కర్పూరమౌతున్నా
అచలిత చలనాన్ని
ప్రబంధాల నిస్వనలో
కాల్చబడిన కాలపు
అనాదరణ పార్శ్వాన్ని
విడిపించుకోలేని బలహీన బలాన్ని
విద్వేషాలను మాత్రమే
చిలుకుతున్న మనసులకు
నేను ఎప్పటికీ మనుధర్మ శాస్త్రాన్నే
మానాన్ని పాతిపెట్టుకున్న మానినినే
మాయని మచ్చల అంగాంగ వర్ణనలో
చెక్కుకున్న ఆనంద గాయాన్ని
అందాల గేయాన్ని ఆలపిస్తున్న
అపస్వర రాగాన్ని
- సుధా మురళి, 8309622246