Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిశి మత్తులో
'రాత్రి' గురకపెట్టే వేళలో
హఠాత్తుగా తలుపుకొడుతున్న
గాలి గొంతుకు గది ఉలిక్కిపడింది.
వెలుతురుతో
కళ్ళు తుడుచుకున్న 'నిద్ర'
తలుపు సందు నుండి
బయటకు చూసింది.
ఆకాశపు చీకటి ఒంటిపై
మెరుపు కొరడా దెబ్బలకు
గాలి గోగ్గోలు పెడుతూ
ఏదో గాలిసోకినట్లుగా.....
ఊర్ల జుట్టుపట్టుకుని
వీధి తలల్ని తన్నుకుంటూ
విసురుగా ఊడ్చుకు ఊగుతూ
రాత్రి చెవిలో
ఉరుము చప్పుడుకి
చీకటి చెవులు మూసుకుంది
నింగి కంటిలో
మెరుపు సవ్వడికి
దిక్కులు కళ్ళు మూసుకున్నాయి.
నేల గుండెలదిరి
తలను ఒడిలో కుక్కొని
వణుకుతూ ముడుక్కొంది.
నింగి, నేల మధ్య మట్టి ప్రాణాలని
తలచి పులకించే
ప్రకతి గొంతుకు వంతపాడే
గాలి, మెరుపు, ఉరుము, వానలది
ఆనాది చుట్టరికమే.
కురిసే ప్రేమే వర్షం
అరిసే గొంతు ఉరుము
దూకే అడుగే పిడుగు
సాచే హస్తం గాలి
అన్నీ బంధువులైన ఈ బంధవ్యమే
మట్టిని దీవించే ముసురుకు పునాది
మనిషిని ప్రేమించే ప్రకృతికి అనాది.
- శ్రీ సాహితి, 9704437247