Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జాబిల్లి సిగ్గు పడుతోంది
నిస్సిగ్గుగా విలువలనెడి వలువలను
వదిలేసి వెకిలి చేష్టలు చేస్తూ
వయ్యారాలు పోతున్న
వగలమారి లోకులను చూసి...
తారలు తల్లడిల్లిపోతున్నాయి
పట్టపగలు పగలబడి నవ్వుతూ
వెటకారపు ఈటెల వంటి మాటలతో
మనిషిని మనిషి హింసించుకోవటం చూసి...
సాగుతున్న సెలయేరు ఆగిపోయింది
కొనసాగుతున్న కర చర్యల్ని
నిత్యం మోసాలు, ద్రోహాలతో సాగిపోతున్న
సమాజపు నూతన పోకడలకు నివ్వెరపోయి...
పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి
ధనార్జన పేరిట దగాలు దౌర్జన్యాలు
సేవ పేరుతో సాగే ముసుగు చర్యలు
పైపూత బంధాల లోగుట్టు
గ్రహించి వల్ల కాదంటూ...
నీలాకాశపు నింగి ఎర్రబడింది
నోటితో పొగిడి నొసటితో వెక్కిరిస్తూ
ముందు మురిపించి వెనుక
ఎత్తివేసే మహమ్మారి
మనుషులకంటి చేస్తున్న
బీభత్సాన్ని చూసి భీతిల్లి...!!
- యస్. వినోద్‌కుమార్
9908312949