Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం మట్టితోనే కదా పెట్టి పుట్టింది
భేదమెరుగక మట్టిలోనే కదా అవధూతలా ఆడుకుంది
మట్టే గ్రౌండు !
ఇంటి మట్టి గోడలను గోటితో పెల్లగించి
ఉగ్గు కన్నా ప్రీతిగా ఆరగించించాం కదా బాల్యంలో
అనగనగా మనం ఉన్నది మట్టి ఇండ్లలోనే కదా
ఎండా కాలం చల్లగా
చలికాలం వెచ్చగా
మట్టికి ఆత్మీయంగా మనమంటే
రక్షగా ఎంత అనుబంధం ఉండేదో
మట్టి కుండలో వంట
తినడం మట్టి చిప్పలో
మట్టి గ్లాసులో నీరు
ఇవన్నీ అడుగడుగు కలలే ఇప్పుడు
మట్టి కవచంగా లేని నివాసాలు
సిమెంటు ఇసుక సలాకల మధ్య
మనం చెమటతో క్యూరింగ్
మట్టి ప్లాస్టికుతో ఇసుకతో సిమెంటుతో
కలగాపులగమై కలుషితం
పంట భూములూ రసాయానాల ఎరువులతో విషం
వాన పడి రేపటికి భూమిలో ఇంకడానికి
మట్టి పొరలు పొరలుగా ఉండాలి కదా
వర్షం సిమెంటు రోడ్లపై పడి
నదీనాం సాగరో గతి !
మట్టి ఔషధం
మట్టి బంగారం
మట్టి మాణిక్యం
మట్టి అరణ్యం
అసలు మట్టి మనమే !
రెండు అర చేతులు గట్టిగా రాసుకుంటే
మన నుండి ఎంత మట్టి రాలుతుందో !
మధు నవనీతం మట్టి
ఇసుక ఇసుకగా పాషాణం కాకుండా
మట్టికీ జ్వరం రాకుండా రక్ష రేఖ కడుదాం
మట్టి చుట్టే మనం ఉందాం
మన చుట్టూ మట్టి ఉండాలి
మట్టి మీదే ఉంటూ
మట్టిలోంచి వచ్చినవి తింటూ
మట్టినే తేలికగా తీసి పారేస్తే ఎలా !
మానుషంగా మట్టిని
అమానుషం కాకుండా కాపాడుకుందాం
మత్తికో రక్షతి రక్షితః
(''save soil''ఉద్యమంలో పాల్గొన్న వేళ...)
- కందాళై రాఘవాచార్య, 8790593638