Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాన్నొక అబద్దాల పుట్ట
కడుపు ఖాళీగా ఉన్నా
చెంబెడు నీళ్ళతో నింపి
పొట్ట నిండిందంటడు
నాన్నొక నమ్మకద్రోహి
తినుబండారాలింటికి తెచ్చి
తినమని తనకిస్తే
బయటే తిన్నానంటాడు
నాన్నొక మోసకారి
మా కన్నీటిని తను తుడిచి
తనలోని దుఃఖ కాల్వలను
గుండె చెరువులో దాచేస్తడు!
నాన్నొక గర్విష్టి
పండక్కి అందరికీ
కొత్త బట్టలు కొని
తనకు నచ్చలేదంటడు
నాన్నొక అహంకారి
తన కష్టార్జితాన్ని
తనకు ఖర్చు పెట్టకుండా
నాకక్కర్లేదని అరుస్తడు
నాన్నొక మొండి మనిషి
తనకు జ్వరమొచ్చినా
నాది ఉక్కు శరీరమని
మందులు బందు చేస్తడు
నాన్నొక స్వార్థపరుడు
తనకన్నా ఎత్తుకెదగాల్నని
తన భుజాల మీదెక్కించుకొని
తను చూడని లోకం చూపిస్తడు!!
(జూన్ మూడవ ఆదివారం ఫాదర్స్ డే సందర్భంగా)
- గంగాపురం శ్రీనివాస్, 9676305949