Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పొద్దున్నే నా నిదురమోము
మా పెరట్లోని
స్పైడర్ గూట్లో చిక్కుకుంది
ఈ అనూహ్య అసహన
స్పర్షానుభూతికి
అసంకల్పిత ప్రతీకార చర్య
గూడు చెదిరిపోవడం నా వల్లే..!!
అహోరాత్రులూ అల్లుకున్న
వన్నె చిన్నెల
వెన్నెల పోగుల విధ్వంసం
నా ఏమరుపాటు వల్లే..!!
ఇంద్రధనువు వర్ణాలను
మేళవించుకొని
జిలుగు జిగురు పోగులను
తనలోంచి తోడుకుంటూ
రేఖాగణితపు కొలతలతో
వ్యూహాత్మకంగా
అల్లుకున్న మహేంద్రజాలం
ఒక్క కుదుపుకి అస్తవ్యస్థం
నా వల్లే..!
జాలి గూడల్లుతూ..అల్లుతూ
ఎన్నిసార్లు జారి పడిందో.!
అన్నిమార్లూ పునర్భలంతో
ఎగబాకుడే
తలచినది జరుగనిదే
తలపెట్టినది పూరించనిదే
పట్టు వదలని నైజం
ఈ అష్టాపాది వైనం..!
అనన్య ప్రతిభా..
ఆకట్టుకునే నైపుణ్యం
ఎవరు నేర్పారో..
ఇంకెవరూ సాటిరారీలోకాన
ఆ అల్లికల వలకి
అన్నట్టు..
తనను తాను
బతికించుకునేందుకే
మెత్తగా మత్తుగా
వెన్నెల దుప్పటి నేసి
వశీకరించుకుంటుంది
వెర్రి జీవులని
మనమే
చీదరించుకొని చెరిపేస్తాం
జీవకారుణ్యం కరువైన మానవులం .
ఎవరి జీవన శైలీ వారిదే,
ఎవరి జీవితం వారిదే..
జీవించే హక్కు
నీదీ నాదీ అందరిదీనూ
గడ్డిని మేకా..
మేకని పులీ,
పులిని ఇంకోటి..
ఇంకోదాన్ని మరోటి
ఆహారపు గొలుసు
సహజమే కదా..!
కన్నూ మిన్నూ కానక
కదిలిపోయే నేనే
ఇవ్వాలిప్పుడు కాంపెన్సెషన్..!!
- నాంపల్లి సుజాత
9848059893