Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేదికేదైనా..!
కాలానికి ఊపిరిపోసే పాటొకటి
పాడమంటారు
ఏ చోటకెళ్లినా
చెలిమిగొంతులు
బతుకుపాట పాడమంటారు
ప్రేమపాటకు చప్పట్లతాళమవుతూ
యుగళ గీతానికి జోడీలు కడుతూ
విరహమో విషాదమో పల్లవి కాగానే
కళ్లను తడుపునే తడివేళ్లవుతారు
విప్లవ గీతమైనా
చైతన్యచరణమైనా
గజ్జెకట్టి దరువేస్తూ
పొత్తిళ్ళలో అమ్మపాటకి
చెమ్మగిల్లిపోతారు
వెన్నెలబువ్వ తీపిపాటకి
కన్నులు విచ్చుకుని
నిండు
చందమామలవుతారు.!
చేయిపట్టి
అడుగులు నేర్పిన నాన్న పాటకి
చేతులెత్తి దండంబెడతారు
బరువెక్కిన గుండెపాటను మాత్రం
దోసిలిపట్టి గుండెలనిండా నింపుకుంటారు
ఎదను
ఆర్ద్రం చేసుకుని పాడడం నాకిష్టం
కాలిన గాయాల జీవితగేయాలను
పాడటమంటే మరీ మరీ ఇష్టం!!
నా పాటని..
అక్కున చేర్చుకునే చేతులు కొన్ని
ఆశీర్వదించే చేతులు మరికొన్ని
ఆలింగనమై హత్తుకునే హృదయాలు ఇంకొన్ని
పాటకి పల్లవై కొందరు
చరణమై ఇంకొందరు
నన్ను..
నా పాటని..
పాదాలకు అడుగులుగా తొడుక్కుని
ఆలోచనా పథాలై నడుస్తున్న వాళ్ళని చూసి
పాటగూటిలో
మరిన్ని పాటలకు పురుడుపోస్తుంటాను!
- ఆది ఆంధ్ర తిప్పేస్వామి
7780263877