Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎందుకో ఈ కవిత్వం
శాలువాలకు బిరుదులకు
సన్మానాలకు చిక్కనంటది
గూడాలు తండాలు
పల్లెలు అడవులు
కాలికి కలం కట్టుకొని
తిరిగొస్తానంటది
పక్షులని పచ్చనీ చెట్లని
చెరువులు నదులు
సముద్రాలు నక్షత్రాలను
పాట పాడమని అడుగుతది
మసీద్ గుడి చర్చి దగ్గర
బిచ్చగాళ్ళతో....
దేవుణ్ణి మీలో ఎవరైనా చూశారా?!
చూస్తే.... నాకు కూడా చూపించమంటది!!
కార్మికులు కర్షకులు
విద్యార్థులు నిరుద్యోగులు
పిడికిళ్ళు బిగించడం
ఇంకా ఎప్పుడు నేర్చుకుంటారంటది
ఇప్పుడో కొత్త ఫ్యాక్టరీ
నిర్మించాల్సిన అవసరమంటది
మనుషులను తయారు చేసేందుకు
మానవతా జెండా ఎగరేసేందుకు
ఎందుకో ఈ కవిత్వం
బిరుదులకు శాలువాలకు
పదువులకు కులమతాలకు చిక్కనంటది
ఉద్యమాల వెంట నడుస్తానంటది
కదులుతాను కదిలిస్తానంటది
అసలు ఎప్పటికీ ఎవరికీ చిక్కనంటది
ఎందుకో ఈ కవిత్వం
ఎర్రనీ మంటై నిత్యం మండుతూనే ఉంటది
- రౌతు రవి