Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిప్పులు వోసి
నీళ్ళ కోసం వెదకినట్లు
ఉన్నదంత తగులవెట్టి
వాగ్దాన ఝల్లులు కురిపించడం !
పండు ముదిరి
పాకానవడి కిందవడే మోపున
ప్రకటనలు సురువు చేయడం !
సబ్ కో కిస్మత్ కా బాత్ !!
నియమాల్లేకుండ నియంతలా
కొస ఊపిరి దాకా
పరుగెత్తించి పరుగెత్తించి
సిట్టసివర్ల చెంచెడు
ఉప్పు నీళ్ళిచ్చి దాహం తీర్చడం !
ప్రగతి రథచక్రం పేరు సెప్పి
ఎంతో మంది
ఉసురు ఉత్తపున్నానికి తీసినంక
వరాలు ప్రకటించి
పాలాభిషేకాలు చేయుంచుకోవడం !
ఇంటికి పిల్సి
పళ్ళెంల పట్టెడన్నం పెట్టి
పక్కన కట్లపాములా కూసుండి
పాపాలు కడిగేసుకోవడం !
బాధ..
భగభగ మండే భాస్వరం !
దుఃఖం..
సలసల మసిలే నిస్వనం !!
ఎంత తోపు పాలకులకైనా
'పట్టు' తప్ప
విడుపు అసలే లేక పోవడం
ఎంత వికత స్వభావం !
ఆత్మగౌరవాన్ని
నడినెత్తిన బోనంలా మోసినం !
ఇప్పుడడ్డగోలుగ మూలాల్ని
మొత్తానికే మర్సుడేం తరువాయి !!
నరాలు తెగేంత
పాన్ ఇండియా లెవెల్ సినిమా
ప్రత్యేక 'తెలంగాణ' !?
కథ,దర్శకత్వం అత్యద్భుతం
బట్ సినిమా అట్టర్ ఫ్లాప్ !!
మాటలేమో..
కోటలకు కోటలు దాటుతరు !
చేతలు..
ఒక్క గడప కూడా దాటదాయె !!
మూడుతరాలు బతికిన ఇండ్లను
అడ్డం పొడవుల..
మూణ్ణిమిషాలల్ల కొల్సిపోయిర్రు !
ఎంపలి సెట్టుకు నిచ్చెనేసినట్టు
ఏడిసినా ఎకరానికింతని ఎల్లగొట్టిర్రు !!
త్యాగం చేసినోళ్ళకు
ఇంత మొగ్గు జోకినట్లుండాలె గని
దండెకొట్టుడు ఇదేం నీతి ?
ఉద్యమాలను..
ఉరికురికి ముందుండి ఉసిగొల్పినోళ్ళే
ఇయ్యల్ల ధిక్కరణంటే..
అగ్గి మీద గుగ్గిలమై పోతున్నరు !
ఆవాసమే లేని
నిర్వాసితులది ఇంకెంత గోస !
ఇల్లు,ఇర్వాటమిడ్సినోళ్ళు..
నోరు తెర్సి ఏమన్న అడిగితే
పతాకశీర్షికల్లో నిరసన కారులా?!
ఈ గుండెకోత..
ఒక్క 'గుడాటి పల్లె'దే అనుకునేరు !
రేపురేపూ..
పోనుపోనూ..
ఇంకెన్ని పల్లెల్ని తాకుద్దో సెప్పలేం !!
జై తెలంగాణ ! జైజై తెలంగాణ !!
- అశోక్ అవారి, 9000576581