Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ పసివేళ్ళు యంత్రం కన్నా వేగంగా
అంట్ల గిన్నెలను తోమి శుభ్రం చేస్తున్నాయి
ఆ వేళ్ళు పట్టుకోవాల్సింది పుస్తకం కలమని
అక్కడ చెప్పేవారు ఎవరు లేరు..
అమ్మ గారికి నీళ్ళు తెచ్చి ఇవ్వు
అయ్యగారికి కాఫీ పెట్టి తీసుకురా
రోబోట్ కంటే వేగంగా కదులుతూ
మేడం గారి ఆజ్ఞని శిరసావహిస్తున్న
ఆ లేత పాదాలకు తెలియదు
తాను నడవాల్సింది బడిబాట వైపుకని..
కార్పొరేట్ స్కూల్లో చదివే కూతురి పాత డ్రెస్సులు
నాలుగు అమ్మగారు తన ముందు పడేస్తే సంబరపడి పోయి
అవే తనపాలిటి చీనిచీనాంబరాలని
మురిసిపోతుంది ఆ పసి హదయం..
తాను పనిచేసే ఇంట్లో వాళ్ళు అందరు తినగా
మిగిలిన రెండు చికెన్ ముక్కలు తన సత్తు పళ్ళెంలోకి చేరితే
అవే తనపాలిటి పంచభక్షపరమాన్నాలని
పరవశించి పోతుంది ఆ అమాయకపు బాల్యం
పేదరికపు ఆకలి పేగుల ఆర్తనాదాలు
అమ్మాఅయ్యల చేతులు విరిచేశాయని
బలిసినోళ్ళ కుటిలావకాశం తన బాల్యాన్ని
ఆ ఇంటి పంజరంలో బంధించిందని
తాడులో బంధించిన డాబర్ మ్యాన్ని షికారు
తిప్పుతున్న ఆ పసిదానికి తెలియదు
ఆ ఇంట్లో తాను ఓ తాడు కట్టని బందీనని
ఆ ఇంటి యజమానురాలు
ఓ అభ్యుదయ కవయిత్రి
ఆడపిల్ల అంటే అద్భుతం
ఆడపిల్ల అంటే ఆయుధం
ఆడపిల్ల అంటే అమతం
ఆడపిల్లలు కారాదు అక్షరాస్యతకు దూరం
ప్రతి సభలో వినిపిస్తూనే ఉంటుంది తన గళం
తన ఇంటి దగ్గర మాత్రం
ఓ బాల్యం బానిస అవుతూనే ఉంటుంది
మూడు కవితలు, ఆరు సన్మానాలతో
తన కవితా ఝరి సాగుతూనే ఉంటుంది నిరంతరం
- వంజారి రోహిణి, 9000594630