Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోగొట్టుకోడానికి
ఏం మిగిలిందని
కదిలే జీవంలేని కట్టెతప్ప
కాళ్ళకింద
పిడికెడుమట్టైనా
మిగలనివాళ్ళు
తేనెతుట్టెనులేపి
బతుకుల్ని బజారు పాలుచేసినట్టు
ఎంతకని వెంటాడి
వేటాడి మంటల్లో బొర్లిస్తరు
రాలడానికి
వొంట్లో చుక్కరక్తం లేనివాళ్ళు
ఎప్పుడో టీఎమ్సీలలెక్కన
జలాశయాల్ని నింపినవాళ్ళు
పొద్దంతా పునికినా
పెయ్యిమీద బొమికలు
తగలనివాళ్ళు
ఏనాడో నుసిచేసి
అన్నం మెతుకుల్లా
మీ ఇంటిల్లిపాది పళ్లాల్లోకి
నడిసొచ్చినవాళ్ళు
ఊరేగింపుల్లో ముందుండి
తలకెత్తుకుని పీఠందాకా
మోసుకుపోయినవాళ్ళు
కోల్పోయింది కొండంత
రాల్చింది ఆవగింజంత
నిర్వాసితులంటే
నేలను కోల్పోయిన వాళ్ళేకాదు
దొంగ రాత్రి పొంగిన వరదకు
సర్వస్వం తుడిచిపెట్టుకుపోయినవాళ్ళు
దీపం మలిపేసి
చూపును చెరపట్టవచ్చు
గూడును చెదరగొట్టి
గుంపును బెదిరించవచ్చు
కానీ
రేపు కడుపు మసిలిన ఊర్లన్నీ
గుండె చెదరని
గుడాటిపల్లివెనకే....
- కొండి మల్లారెడ్డి,
9652199182