Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనం సంతోషంగా ఉన్నాము..!
ఎందుకంటే
అగ్ని కీలలు మనవైపు లేవు
అవి వారి వైపే ఎగిసిపడుతున్నాయి..!!
వారి ఇల్లు కాలిపోతోంది
దిక్కులు పిక్కటిల్లేలా ఆర్తనాదం వినిపిస్తోంది
అయినా చలనంలేక
కొంత మంది మొహం చాటేస్తోంటే
మరి కొంతమంది మొఖాల్లో
యుద్ధాగ్ని కాంతి వికసిస్తోంది..!
ఈ స్వార్థాల కాష్టం ఆరిపోదు..
అంచెలంచెలుగా విస్తరించి
ఊరంతా అంటుకుంటుంది..!
ఈ మంటలు మనల్ని కూడా చుట్టుముడతాయి
అప్పుడు మనలో కొందరు క్షతగాత్రులవుతారు
ఇంకా కొంతమంది అమాయకంగా మళ్లీ మళ్లీ చప్పట్లు కొడతారు..!
అక్కడక్కడ కొందరు
అప్రమత్తమై గగ్గోలు పెడతారు
ప్రతిస్పందిస్తూ మానవ ప్రయత్నం మొదలెడతారు..!
కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ
ఈ నిప్పు పూర్తిగా చల్లారదు..
రాజకీయ కుతంత్రాల మాటున
మిగిలిపోయిన ఈ యుద్ధపు సెగ
వీచిన గాలి వాటానికి భగ్గుమని
ప్రాణాల మీదకు వెళ్తుంది..!
లేనోళ్ల ఆర్తనాదాలు..
ఉన్నోళ్ల పోకడలు..
చిన్న, పెద్ద అంతరాలు..
కుల మతాల కుమ్ములాటలు..
అహంకార రాజకీయ ఎత్తుగడలు....
దావానలంలా విస్తరించకముందే
ఈ మంటలు చల్లార్చబడాలి..!
లేదంటే, కాదంటే,
ఆ మంటలో అందరూ
బూడిదైపోవడం ఖాయం..!
మంట మనవైపే చూస్తోంది
చల్లగా ఉండటం అంత మంచిదేం కాదు...!!
- డా|| వాసాల వరప్రసాద్,
9490189847