Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీర్లో ముంచి బిర్యానీలో కుక్కి
ఓట్లు దండు కొన్నాము
ఓట్లుకాదనీ సీట్లూ కొన్నాము
గద్దె నెక్కిన పాలన మాది
సర్వం మాదైనప్పుడు మురువొద్దు మరీ
పోలీసోళ్ళు మా వోళ్ళు
చట్టం రూపొందించేది
అమలు పరిచేదీ అంతా మేమే
చింతలొద్దు
మాటల గారడితో మతులు
విరక్తి కలుగోద్దనీ భక్తిని నూరిపోస్తున్నం
విద్వేషాలు బుసలు కొట్టినోల్లము
మనుషుల్ని మత్త కొలుపమా ?
వెన్నతో వెన్నుపోటు నేర్చినోల్లమ్
పన్ను పోటు ప్రతాపం చూపమా?
కోట్లుపోసి
అభివద్ధి కోసం అహరహం శ్రమిస్తున్నం
అశాంతి చిటపటలతో శాంతి సస్యశ్యామలం చేస్తున్నం
అర్థం చేసుకోండి
దేశాన్ని ముందుంచుతాము
నమ్మిన సర్కార్ సంస్థలు అమ్మినా
ఆకలి సూచిలో అప్ఫుల సూచీలోనైనా
జగత్ కుబేర సంకల్పం మా కల
గెలుపు పెట్టుబడి అతడు
మర్యాదొద్దా?
నిరూపనైతే కదా ఆర్థిక ద్రోహి
అప్పట్దాక దగ్గరుండి సెండాఫ్ చేద్దాం
దాసిన బ్యాంకుల్నీ మూసినా సరే
కూటికి లేకుంట అయితది కావొచ్చు
ఐతే మాత్రం ఐదు తరాలకు కూడపెట్టాలే కదా
ఇంకేం? మేధావులకు భయం పుట్టించినం
ప్రశ్నించే గొంతులను మ్యూట్లో పెట్టినమ్
తార్కికుడు తందాన పాడుతుండు
ఒర్రుబోతు ముద్రేసి నిర్ణయించినమ్
సకాల విద్దెలతో గద్దె నెక్కితిమి
బుద్దికలిగి ప్రశ్నించినోల్ల ఎనలేని జాలి కలిగి
నొప్పి తెలియని శిక్షలు అమలుచేయడానికి
హై టెక్కులతో జైళ్లను ఆధునీకరిస్తున్నాము
చరిత్ర పునరావతం అభూత కల్పన
చరిత్ర లేనోడు చరిత్ర సష్టిస్తడా?
అదంతా వట్టిదే
లంక తిరుగుబాటా?
అంతా సీనుందా ఈ దేశానికీ
ఆ ఆలోచనలొస్తయా ఈ మనుషులకీ
ఎవరి చేతులో ఎవరుండకుండా?
ఒకని చేతిలో ఒకని పెట్టినమ్
సమయమొస్తే ప్రాణాలు తీసుకోనైనా
వాళ్ళే తన్నుక సస్తరు
మాకేం దొఖా?
(లంకలో తిరుగు బాటు దారులు
అధ్యక్షుని ఇంటిలోకి చొరబడ్డ సంఘటన ఆధారంగా...)
- డా. సిద్దెంకి యాదగిరి, 9441244773