Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నింగిని చీల్చుకుంటూ వచ్చి
భూమిని తాకే మేఘపు పులకరింత !
భగ భగ వేసవికి సెలవిచ్చి
శీతలశీకర పలకరింత!
నింగికి నేలకు మధ్య
ప్రేమ ప్రసార భాషణంపు ముద్దుల వర్షంలో!
లేగదూడను ఆవు నాకే
వాత్సల్య దశ్యావిష్కరణ!
చెట్టును పలకరించి
రాయిని చిలకరించి
ఎగసి మిడిసి పడుతూ నదిని
తట్టిలేపే ఉద్యమ పద్యం!
చేను చెలకలకు అనుకోని అతిథి
ప్రకతి మాత
ఉమ్మనీటి నుండి
పంటల ప్రసూతి !
వాగు వంకల, సెలయేరులలో
కప్పల గాన కచేరీ
చేపల నత్య విభావరి
కాగితపు పడవల వయ్యారపు పోటీలు
వర్ష వార్షికోత్సవాలు
వానకళావల్లభుని హర్షాతిరేకాలు!
నిరాశ్రయుల కన్నీటి జలపాతాలు
తానై తరలి వచ్చిన గంగమ్మ చిద్విలాసాలు
పునరావాస కేంద్రాల
చుట్టూ వాలిన గూడు తెగిన పక్షుల
పొట్ట కూటి పలవరింతలు
తాగు నీటి కలవరింతలు
వర్షం ఒక సందేశ వారధి
మట్టి గంధంతో
మనిషి సౌందర్యం
చేసిన పరుసవేది
వర్షం ఒక గీటురాయి
మనిషి చేష్టల వికత
పోకడల నిగ్గుతేల్చే ఆకు రాయి
వర్షం ఒక సంకేతం
రాబోయే సంతోషానికో
విషాదానికో
రహస్య సందేశం మోసుకొచ్చే
కపోతం
వర్షం ఒక రుజువు!
తాను చేసిన పచ్చని హత్యలకు
మనిషి ఎదుర్కునే
పర్యవసానపు హెచ్చరికల దరువు
- కె ఎస్ అనంతాచార్య
9441195765