Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాహ్య అంతర ప్రపంచంలో
భిన్న ధృవాల మధ్య నిరంతరం
అస్తిత్వ సంవేదనలతో కొట్టుకునే లోలకం స్త్రీ
విభిన్న బంధాలు ఆమె చుట్టూ పాదుకొని నిలబడతాయి
వివిధ పాత్రలతో అల్లుకొని
నియంత్రణ నీడలో మగ్గుతుంది
ఆమె స్థాన బలంలేని బలవంతురాలే
నిస్త్రాణ మాత్రం కాదు
కుటుంబ జీవనంలో తీరికలేని ఆమె
ఇంటి బయట మహిళగా...
ఆమెకు ఆమెనే చిరునామాగా
ఒంటరిగా
విశ్వంలో చాలా చర అచరాలు స్త్రీ లింగమే
ఏ చరమైనా దేనికదే
కలవని సరళ రేఖలుగా
నామమాత్రంగా ఉన్న పులింగ రాశులలో
ఆలోచనా శక్తి ఉన్న మానవ మృగయా వినోదం
అంతా ఇంత కాదు.
ఆదిమకాలం మాతృస్వామ్యం
పశుపాలన (బలం)తో ముగిసిపోగా
దిగజారిన విలువలతో స్త్రీమూర్తిగా ఎదిగిన ఆమె
హింసను భరిస్తూ
అంతరంగ వేదనల
సుడిగుండాలను దాటే నావగా మారింది
నిత్యం ఎక్కడో ఒక మూల ఒక ఆర్తనాదం
ఎన్నో గాయాలు
ఒక చావు
మరిన్ని వేధింపులు
బలహీనులపై పశుబలం
బుద్ధిహీనతకు కొలమానం
అసమ పోటీ
ప్రతిబంధకంగా పరిణమించినా
నిబ్బరంగా నిలబడిన ధీశాలి
వంచకుల నీడలు కుంచించుకుపోగా
ఆమె ఎదిగిన క్షణాలు గుణపాఠాలుగా
ప్రపంచాన్ని చుడుతున్నాయి
ఆమెకంటూ లేని జీవిత భ్రమణం
కాల గతిచలనం
జీవ
సృష్టికి, స్థితికి, లయకు కారణం
బరువులన్నింటిని మోస్తూ పరిభ్రమణం
చీకటి వెలుగులు అనుభవించే వారికి ఉపశమనం
కాని., ఆగని ఆమె పరుగు
రోజుల్ని మండిస్తూ వెలుగుల్ని పంచుతుంది
యుగాల్ని నడిపిస్తూ
పురోగమిస్తుంది
- బి. వేణుగోపాల్ రెడ్డి