Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యుద్ధం మొదలైంది
శత్రువు ఎదుట కానరాడు
కనబడని ఆయుధాలు
గాయపరుస్తూనే వుంటాయి..
యుద్ధం మొదలైంది-
పాలకులను గెలిపించి
ప్రజలు ఓడిపోతూ వుంటారు
శత్రువు కానరాడు, ఆయుధాలు కానరావు
కానీ, అన్నీ ధ్వంసమై పోతుంటాయి,
అన్నీ తగలబడి పోతుంటాయి
నేల చెక్క, చిదుగులు కొల్లగొట్టబడుతుంటాయి
ఐనా,
నేలమట్టమవుతున్న జీవితాలపైన
దేహాలు నిలబెట్టే పథకాలు
పురుడు పోసుకుంటాయి
యుద్ధం జరుగుతూనే వుంటుంది
శత్రువు కానరాడు-
కానీ
అప్పుడప్పుడు ఆయుధాలు
అందమైన ఆకారాలతో దర్శనమిస్తూ
ఒడిలోకి చేరి ఊపిరిని
కొసరు కొసరుగా పీల్చేస్తుంటాయి..
మాటలు, సైగలు, వాగ్దానాలు,
నవ్వులు, పలకరింతలు, పలవరింతలు
అన్నీ గుబాళిస్తూనే
గులాబీ రేకుల మెత్తదనంతో
పరిమళాలు వెదజల్లుతుంటాయి
ఐనా, కానరాని ముళ్ళు తడి గాయాలను
మళ్ళీ మళ్ళీ గాయపరుస్తూనే వుంటాయి
నగదేహాలపై కారుతున్న రసిని
ఉచితాలు, అనుచితంగా
మరుగుపరిచే ప్రయత్నాలు కొనసాగిస్తుంటాయి
యుద్ధం జరుగుతూనే వుంటుంది
అంతటా నిశ్శబ్దం, మౌనం,
గొంతు పురివిప్పిన చోట నాగస్వర హేళ
యుద్ధం జరుగుతోంది-
ఒక ఆయుధాన్ని వెతకాలి
ఒక నమ్మకాన్ని వెతకాలి
ఒక విశ్వాసాన్ని వెతకాలి
ఆత్మను వీడని ఒక నీడను వెతకాలి
వాటి భుజాలపైన ఆయుధాన్ని నిలిపి
శత్రువు నెదుర్కోవడానికి,
ఒక ఆయుధాన్ని వెతకాలి
సమాజమా! ఒక నమ్మకాన్నివ్వు
ఒక విశ్వాసాన్నివ్వు, ఒక భరోసానివ్వు
ఇప్పుడు ఒక ఆయుధాన్ని సిద్ధం చేసుకోవాలి...
యుద్ధభూమి దగ్గర్లోనే వుంది
గెలుపే సుదూరంలో
ఒక పొగమంచు తెరలా ఊరిస్తోంది...!
- డా. రూప్‌కుమార్ డబ్బీకార్
99088 40186