Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వూరూరికి నదీనదాల పాదాలు పారకున్నా....
పల్లె అయినా, పట్నమైనా సేదదీరేది
మా సెరువులతోనే...
మట్టితోని మరులుగొన్న నీటి వూటల్ని, మేటల్ని
తోలుకొచ్చే తొవ్వలము
నేలమ్మ నెలువులకు దిగొచ్చిన నెలవంకలము
మబ్బమ్మ పారేసుకున్న అద్దాలరైక ఆరబోతలము
పూరువాడలకు, జీవకోటికి వుమ్మనీల్లము
వూరువాడల సెమటలకు, కన్నీల్లకు
దారగట్టి నిలబడిన నీటికుండలము
గియ్యాల సెరువులు కుంటలన్నీ కంటగతికొచ్చినయి
మా సెరువులకు కరువులొచ్చిన గాచారాలు
మా సెరువు సెంపల సంపదని సెదబట్టిచ్చి
సేతాల్లమే జేసిన శీతకండ్లు
నా తెలంగాణ తల్లికి కృష్ణాగోదారమ్మలు పాదాలనాదాలైనా
మా సెరువులో కుంటలు వాగులు వంకలే జీవజలము
నడుముకు నడికట్టేసిన బలము, బలగము
అభివృద్ధి పేరున ఆగంపచ్చులమైతిమి
రియల్ ఎస్టేటుల్ల దయమైపోయిన మా రాజ్యాలు
ఎటుజూసినా ఎద్దడుగంత మన్ను జాడలు
జమాయించని సిమిటి సిమెట్రీలు
మా మొసల్ని మూసేస్తున్నయి
తెలంగాణమ్మకు సెరువుల తోరణాల హారాలుగా వున్న
వేలవేల మా గొలుసుకట్టుల్ని
సావగొట్టి సెవులు మూసిన మునావులు
మా నీళ్ల సుక్కల్ని ఎండన్న ఎత్కపోయినా
మొగులన్న మేత్పరిచ్చినా
చక్రవడ్డీ, బారువడ్డీలుగా ఆడిబిడ్డెల అప్పని
వాన బానలతో బాకీదీరుస్తరు
ఒకనాడు భాగ్యనగరానికే బహుసక్కని
సల్లటి తియ్యటి కొబ్బరి నీల్లసోంటి కొలనుగా
పేరున్న హుసేన్ సాగర్‌ను, ముట్టుకోని అంటుకోని
మురికి గుంటయిన విష రసాయనశాల
బుద్ధుని చుట్టూ సాగిల పడి సలాం జేస్తున్న
నక్లేసు రస్తాలు, నాగరిక రిస్తాలు
తెలంగాణొచ్చినా తేటపడ్తలేమాయె
దోసిట్ల నీళ్లను జూసుకుని
దొప్పల నీళ్లను వొల్కబోసుకొనే అల్కతనాలు
భాగ్యనగరానికి భాగ్యంగున్న జలశాలలు
దశాబ్దాలుగా దూపదీరుస్తున్న దీపాలు
ఏనాడు ఎండిపోని నీటి సుడులు
సముద్రాలను సదురుకొనొచ్చిన
మా జంట జలాశయాలు
హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్లను
కాపాడే జీవో కంబెలిరిసి కాటికి తోలుతున్న శాపాలు
గియ్యాల మమ్ముల సమాధులు జేస్తున్న పాపాలు
రేపు మానవకోటిని వరదబురదల మురిగే
సమాధులు జేసుడు ఖాయమే
- జూపాక సుభద్ర