Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంత
నేత పాట అల్లుతున్నా
కల ఊరుతూనే ఉంది
పాట ఆగక ముందే
కల తీరే వీలున్నదా?
ఈ చేతి కష్టం
ఈ చేతి సొమ్ముకు
ఎప్పుడూ సరితూగదు
మెట్టు దిగడమే గానీ
ఎక్కింది లేదు.....
పడడమే గానీ
పడగొట్టింది లేదు.....
కూడు కేడ్చినా
గుడ్డ కేడ్చినా
గూడు లేక నీడ కేడ్చినా
ఆ ఏడుపే
వాడి ముడిసరుకు అయితున్నది
ఈ తాబేలు కుందేలు పరుగు పందెంలో
ఎప్పుడూ తాబేలే ఓడుతున్నది
కలలకు రంగులద్ది
ఏడు రంగుల ఇంధ్రధనుస్సు
ఇలకు దిగుతున్న పోగు మీది ధ్యాస
మహా పాపమయ్యింది
మడుగు ఎండిపోయే దుఃఖం పొంచివున్నది
పట్నం పని తొవ్వకు
సుమతి ఎగబాకుతున్నది
కాలమతి ఎప్పుడో కాటగలిసింది
నలుగురు ఏకమయ్యే పట్టుదల
పట్టుదప్పింది
ఐదువేళ్ళ పిడికిలి ఆగమయ్యింది
ముల్లుని ముల్లుతోనే అన్న వాస్తవం
మరుగునవడ్డది
అరికాలి ముల్లు
మోకాలుకు పాకుతున్నది
జిల్లేడు పాల గుణం
అడవి పాలయ్యింది
మొదటి ప్రమాదం తాలూకు గాయం
మానక ముందే
రెండవ ప్రమాద హెచ్చరిక అగుపడుతున్నది.
- గజ్జెల రామకృష్ణ, 8977412795