Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చూస్తూ ఉండగానే
ఒక చిన్న గాలి విసురుకు
ఓ పండుటాకు నిశ్శబ్దంగా
నేల రాలింది!
రాలిన ఆకుకు లేదు
రాల్చుకున్న చెట్టుకే దుఃఖమూ లేదు
నన్నే ఆ దశ్యం వెంటాడే
విరిగిన పద్య పాదమైంది!
రామాయణమంతా తానై నడిపి
నేలలోకి నిష్క్రమించిన భూజాతలా
రాలిన పత్రం జీవన పాఠం విప్పి
నాకింత పత్ర హరితాన్నిచ్చింది!
మట్టి వుంటేనే చెట్టుంటుంది
రశ్మి సోకితేనే ఆకు పచ్చగుంటుంది
నేల రాలిన దశ్యాల్నీ మట్టిలో కలిసి
నాకో హరిత పత్రాన్ని రాసిచ్చాయి!
నేను చెట్టయి
వసంతాన్ని ధరించందే
ఆకులందున అణగి మణిగే
కవిత కోయిల కూయనంటోంది!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి,
94402 33261