Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇది నా దేశం గాధ... నే యువతకు చేస్తున్న బోధ...
నా దేశ మనుష్యుల్ని వాళ్ళ తీరుతెన్నుల్ని చూస్తుంటే
ఎప్పుడో బాల్యంలో చూసిన 'జూ 'గుర్తుకొస్తుంది
రాజసం ఒలకబోసే మత్తగజాల్లా మంత్రివర్యులు
పెంచిన కుక్కల్లా పోలీసులు - తోడేళ్ళలా అధికారులు
రాబందుల్లా పీక్కతినే చీకటి వ్యాపారులు - కీచుకీచుమనే పిచ్చుకల్లా జనావళి
పండ్ల కోసం వెదకులాడే రామచిలుకల్లా దేశం విడిచిన మేధావి వర్గం
ఇదే ఇదే నా దేశ మనుజుల గాధ -నడుస్తున్న చరిత్ర
ఇక నా దేశాభ్యుదయం ఇదిగో కనండి వినండి
ఖద్దర్ లాల్చీల ఉద్దెర వాగ్దానాలలో ముద్దుగా నిద్దుర పోతుంది నా దేశం
ఏడాది కోసారి ఏ సన్మానసభలోనో స్మారక సభలోనో
కళ్ళు తెరిచి ఆవులిస్తుంది కలవరిస్తుంది పలరిస్తుంది
చెదిరిపోయిన పూరి గుడిసె - తెగిపోయిన నులక మంచం
జారిపోయిన యవ్వన చాయలు స్పష్టంగా కనిపిస్తున్నా -
కవ్వించాలని మెరుగులు దిద్దుకొంటున్న ఫుట్ పాత్ వేశ్య లాగుంది నా దేశ ఎకానమి
సప్లమెంటరి బడ్జెట్ పట్టుకోక చుట్టినా - వన్నెవన్నెల జిలుగు చీరెలెన్ని కట్టినా తెలుస్తూనే ఉంది నా దేశ ఎకానమి బిగువు
ప్రభుత్వం వేస్తున్న ప్రతి కమీటి తీరుతెన్నులు
ముసలి వయస్సులో పెళ్లి చేసుకొంటున్న కన్నెల్లా ఉన్నాయి
పెళ్లి ఖర్చు దండగ తప్పా ఆనందం అనుభవం శూన్యం
సరిదిద్దే నాథుడులేక డాక్టర్ రాక విలవిలలాడుతుంది నా దేశం
ఇక నా దేశ నడక నాగరికత
ఇక్కడ పార్టీకి క్యాడర్ కానివాడు లీడర్ పైసలున్నోడు నాయకుడు
ఆదర్శాలకి తిలోదకాలిచ్చిన వాడు మానవత్వం ఎరువు తెచ్చుకొన్నవాడు
తోక వాల్చడం నేర్చుకున్నవాడు భట్రాజుగా మారినవాడు
వందిమాగదిగా ఎదిగినోడు కోట్లు కొల్లగొట్టినోడు
కాకాలు పట్టేవాడు - బాకాలు ఊదేవాడు
నా దేశ ప్రజాప్రతినిధి నా దేశ నాయకుడు
ఎటు పోతుంది నా దేశం - ఏమవుతుంది ప్రజానీకం