Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవును వాళ్ళిప్పుడు మేజర్స్
అంటే..
రెక్కలొచ్చిన పక్షులన్న మాట..!
మానసిక శారీరక పరిణతి
చెందిన వాల్లు..!
నువ్వింకా..
స్పూన్ ఫీడింగ్ చేస్తానంటే.. ఎట్లా
కాళ్ళ మీద బజ్జోవెట్టి
లాలపోస్తానంటే ఎట్లా..!
నూలు బట్టల తాను తెచ్చి
అంగీలాగు కుట్టిస్తానంటే ఎట్లా..!
నీ గుండెల నిండా
కొండంత ప్రేమ ఉండొచ్చు గాక,
ఇప్పుడు..నీ ఇష్టాఇష్టాలకి
ఆ నవ్యాభిరుచులకి పొత్తు కుదరదు..!
నువ్ చేరని కలల తీరం
వాళ్ళకు గమ్యాన్ని నిర్దేశించడం
నీ కీర్తి కిరీటాల కోసం
వాళ్ళ నెత్తిన బండలు మోపడం సరికాదు.!
నేను చెప్పిందే వేదం
నా తొవ్వే శిరిసావాహం
లాంటి గీతలు గియ్యకండి..!
ఎవరి బలాబలాలు వాల్లవే
వాళ్ళనిలా చక్రబంధాల్లో ఇరికించకండి
పాలూ నీళ్ళని విశ్లేషించుకునే సత్తాఉంది..
లేదంటే వస్తుంది..
ఒకప్పుడు..
అది నిప్పు కాలుతుంది అన్నావు..
వాడు విన్నాడా..!?
ఓసారి కాలింది వెనక్కి తగ్గాడు
కాలికి ముళ్ళు గుచ్చింది
చూసి నడవడం నేర్చుకున్నాడు..
ఈదడం నేర్పడమే నీ వంతు..
గమ్యం చూపడమే నీ కర్తవ్యం
నైపుణ్యాలని అలవర్చడమే నీ బాధ్యత
విచక్షణా జ్ఞానం సహజాత ప్రక్రియ
కాబట్టే వాడు మేజర్..!
మెదడుకు పని కల్పిస్తేనే,
కొత్త ఊట జలిస్తుంది
వాడు ఉదయించిన సూర్యుడు
ఆకాశమంతా దున్ని రానీండి..!!
వాళ్ల శ్వాసా నిశ్వాసలని పై నిఘా
వదిలేయండి..
అవును వాళ్లిప్పుడు మేజర్స్..!!
- నాంపల్లి సుజాత, 9848059893