Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమయాన్ని ముల్లులా గుచ్చుతున్న రోజులవి..
ఆధిపత్యపు అహంకారం కళ్ళు తెరిస్తే
జాలి కరుణలు మసకబారితాయి
హద్దులు మీరిన మనిషి సరిహద్దు పోరాటాలు
కత్తి కన్నా పదునెక్కుతాయి
గుండె తెగిన శ్వాసలు..
శ్వాస తెగిన గుండెలు..
మానవత్వం మడుగులా ఎర్రెర్రగా పారుతుంది
ఆయుధాలు అమానుషంగా చల్లాక..
విధ్వంసపు వికృత ఆకృతిలో
ఊరుకు ఊరే స్మశానంలా మొలుస్తుంది
కంటగింపు కావలించుకొని
కలుపుమొక్కై మనిషినే పాతిపెడుతుంది..!
యుద్ధం రక్తం తాగుతున్న కొద్దీ మనిషి మదంతో ఉబ్బిపోతాడు
స్వార్థం ప్రేమను విస్పోటంలా పేలుస్తుంది
మమతను సమూలంగా మట్టు పెడుతుంది
రాజ్యాధికారి కోసం..
చేదెక్కెన శ్వాసతో మారిన ముఖం రంగుతో
మనకు మనమే మాయని ప్రేత కళ వీస్తున్నాం
కుర్చీల కోసం ఖూనీ కుతంత్రం
ఇది ఏ రాజ్యాంగానికి సంకేతం..?
శాంతిని తెల్ల పావురంలా గాలికి వదిలి
ఎర్రని రక్తంలో ఇప్పటికీ మంచితనాన్ని ముంచేస్తున్నాం
తరాలు మారినా తారతమ్యం శూన్యం
సమస్యను సామరస్యంగా సాధించటం చేతకానపుడు
రెండు చేతులు కోల్పోటానికి ఒక్క యుద్ధం చాలదూ..?
మనిషివని మరవడానికి..
మనసుకున్న అవిటితనం చూపటానికి..
ఒక యుద్ధం చాలదూ...?
- బొప్పెన వెంకటేష్, 9866584062