Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏకాంతంగా నేనూ నేల ముచ్చటించుకుంటాం.
సాధక బాధలను పంచుకుంటాం.
మట్టిలో దాగిన మాధుర్యాన్ని పెనవేసుకొని..
సాగుబడికై నడుంకట్టి కదులుతాం.
మేఘం నల్లమబ్బులై భూమివంక చూస్తుంది.
వర్షపు చినుకులై పుడమిని పులకరింప చేయాలని.
సెలయేరు పచ్చని పందిరై పండాలని..
నీరు ఉరకలెత్తి దుంకుతుంది.
పంటకాపు పాదాలని కడుగుతూ.
పొలం తనువుపై పురుడోసుకుంటున్న
మొక్కలన్నీ ఆకలి రూపాలై ఎదుగుతున్నాయి.
సేద్యకాడి కలల్ని కళ్ళలో నింపుకొని.
దుక్కిదున్నిన చేతులకు మట్టి...గంధమై తాకుతుంది.
స్వేదపు చినుకులు సేను ఎదను ముద్దాడుతున్నాయి
నేల...అన్నదాత ఇద్దరూ యుద్ధంలో మునిగిపోయారు
విశ్వానికి పెట్టెడణ్ణం పెట్టడానికి.
ఆశల స్వప్నాలను పొలంగట్టున కట్టేసి..
నేలపై వ్యవసాయపు కవిత్వం రాస్తున్నాడు అన్నదాత
భూతల్లి సాక్షిగా బువ్వపూలు పూయిస్తున్నాడు.
మట్టిని కప్పుకొని ఎదుగుతున్న విత్తుకు తెలుసు...
కర్షకుని కష్టమేంటో.
పంటకాపు గుండెల్లో నిండుకున్న దుఃఖపు..
మబ్బుల్ని చేరిపేసి..
ధాన్యపు రాసుల్ని ధనరాసులుగా గుమ్మరించాలని
రెండాకుల కొమ్మలై విరబూస్తున్నాయి.
పువ్వులన్నీ విచ్చుకుంటున్నాయి పంటకాపు ప్రతిరూపమై.
నేలంతా రైతన్న కష్టం పచ్చని పంటలై.
వాళ్ళిద్దరి పోరు ఆగదు
ఎలాంటి ఫలితం ఆశించని సేవకులై సాగుతారు.
వాళ్ళిద్దరి కష్టం ఎక్కడికి పోదు.
బుక్కెడు అన్నం మెతుకులై ఆకలితీరుస్తారు.
ప్రపంచానికి ప్రాణంపోసే అమతమై కురుస్తారు.
- అశోక్ గోనె, 9441317361