Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలు పిండినట్లు
తుకం పీకి
పసిగుడ్డును ఎత్తుకున్నట్లు వరిని చేతిల పడుతది
బురుదల అడుగు గుర్తులను ఇల్లు మెగినట్లు మెగుతది
వరితో భూమికి ఆకుపచ్చ రంగేస్తది
అయినా ఎడా రైతక్క పేరు లేదు.
మెట్టినింటికి పొయినా కన్న కూతురును
మాట్లాడిచ్చినట్లు
వరినంతటిని తన వేళ్ళతో మాట్లాడిస్తది
బిడ్డ కష్టసుఖాలు పంచుకున్నట్లే కలుపునంత దీసి గెట్టుకేస్తది.
తల్లి మాటలకు బిడ్డ మురిసినట్లే
ఆమె చేయి తగిలిన పైరు పచ్చగా ఇగురు పెడుతది
అయినా ఎడా రైతక్క పేరు లేదు.
ఇల్లుతోని ఇల్లేడు సార్గం జేసి
అద్దుమ రాత్రి దాకా కునుకులేకున్నా
వేగుచుక్కై మొలిసి పొద్దుగాల్లనే పోలాల్లొ వాలి
గువ్వలు గూటికి చేరే టైంకు ఇంటికి చేరుకున్న
రికాం లేని మిషిన్ లెక్క
గంటలకు గంటలు చేతి గీతలు అరిగిపోయేల
కష్టం జేసినా ఎందుకో ఎడా రైతక్క పేరు లేదు
ఎంత జేసినా పేరు లేని షేతనే
అయింది రైతక్కది.
- జి.యం.నాగేష్ యాదవ్ , 9494893625