Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆర ముగ్గిన
పలుకు తొనల పండు
అమ్మభాష
కొత్త కొమ్మల చురుకు నోళ్లకు
మునుపటిలా రుచించడం లేదు!
అమృత ధారల కోసం
తేపకార్చే రుచిమొగ్గల్లా
విచ్చుకున్న చివురు నాలుకలు
అనుకరణ మడతల్లోకి
ముడుచుకున్నాయి
స్తన్యం పంచిన జీవామృతంతో
ఊపిరి మొలకను
ఊహల కందని వృక్షంగా పెంచుకున్నాక
తల్లివేరు తల తెగిపోతోంది
కొండ కనుమ లాంటి గొంతులోంచి
ఉబికొచ్చిన జీవధార ఎండిపోతోంది
ప్రాణాక్షరమై తడి నాలుక మీద
తారాడిన తేమ ఆరిపోతోంది
అక్షరాల తొలకరి జల్లులా
ప్రేమ కురిసే నల్లబల్ల ఆకాశం కింద
పూలతోట లాంటి బాల్యావరణమంతా
ఆమ్లవర్షం లాంటి ఆంగ్లవర్షంలో
తడిసి ముద్దవుతోంది
మెలికలు తిరుగుతూ
పిట్టగూడు వైపు పాకిన పాములా
చల్లగా చొరబడింది
పరాయి పెత్తన భాష ..
గుడ్లున్న తన గూడు చుట్టూ
టపటప రెక్కలాడుతూ ఎగిరే
ఓటి రెక్కల పిట్టలా
సొంత భాష ..
ఆనాటి తీపి బాల్యానికి
తీరైన ఆశ్రయమిచ్చిన భాష
యిపుడు ఒక కాందిశీకురాలు
ఎన్ని యుద్ధాలను దాటైనా
తనకొక పునరావాసం ఇవ్వాలి
ఇంట్లోనూ బడిలోనూ..
- కంచరాన భుజంగరావు
9441589602