Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంతి కిరణాలు దుఃఖపు కత్తుల వేటకు
తెగిపడినపుడు.. నిశీధి నాకు నేస్తమై తోడుంటుంది.
కన్నీటి పాటై నేను రాగమందుకున్నపుడు
రాలుతున్న అశ్రువును కానరాకుండా..
తనలో కలుపుకుంటుంది.
నకనకలాడుతున్న ఆకలిమంటలు ఎగసిపడుతుంటే..
కళ్ళలో నిద్దుర నెలవంకలను పొడిపించి..
కష్టాలను కాస్త మైమరిపిస్తోంది.
నేను... మోసం... ఎప్పుడు పోటీపడుతూనే ఉంటాం.
గెలుపు మజిలీ తలుపుతట్టిన సందర్భాలు లేవు.
నేను... కష్టం... కలియతిరుగుతూనె ఉంటాం
అందనిద్రాక్షయి ఫలితంక్షణాల్లో చేతులు మారుతుంది
నేను.. దుక్కి.. దుఃఖపు వానై నానిపోతూనే ఉంటాం.
శ్రమకు దక్కని విజయాన్ని తలచుకుంటూ.
అందుకే.. నేను... తిమిరతో తిరుగుతూనే ఉంటాను.
దోస్తీ చేస్తూనే ఉంటాను. కన్నీటిని తుడుస్తుంది.
మోసపూరిత సమాజాన్ని నాకు ఎరుకజేస్తుంది.
నాకు తెలుసు చీకటి గుట్టల తెరచాటున..
విజయపు వెలుగుల దరహాసం దాగివుందని.
రోజూ నా చెవికి... చీకటి చెపుతూనే ఉంటుంది.
చెమట చుక్కలు చిందించడం మరవకు అని.
పగలురాత్రులు శ్రమించడం ఆపకు అని.
గెలుపు గుర్రాలు ఏ మూలనుంచో నిను చూస్తున్నాయని..
అంతులేని పోరాటాన్ని ఆపకు అని.
ఓటమేమి నీకు కొత్తకాదని.
పచ్చని తివాచీ పరిచిన అద్భుతమైన ఫలితం..
రాబోతోంది అని.
చీకటితో నా బతుకుపాటను చెప్పుకుంటాను
రేపటి భవిష్యత్తును కలగంటాను.
స్వప్నాల్లో విహరిస్తూ పోరాట పాఠవాలను నేర్చుకుంటాను.
విజయ తీరం చేరడానికి
ఎన్ని చీకటి రోజులనైనా గడుపుతాను.
గెలుపోక మదురగీతమై నను చేరేవరకు.
- అశోక్ గోనె, 9441317361