Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెళ్లయిన ప్రతి ఓళ్ళ భాగస్వాములనూ
స్పౌజ్ అనే అంటారు..
వెలగబెడుతున్న నౌకరీలతో మాట లేకనే
వాళ్ళు దంపతులు..
ఒకళ్ళపై ఒకళ్ళు ఆధారితులు
ఒక్క గుడ్డులోని రెండు రంగుల్లా ఒదిగి
ఒక్కసూరు కిందే ఉండే జీవులు.!
మానవ వనరుల ఆవిష్కరణా
వాటి దిద్దుబాటే లక్ష్యంగా
ఒక్క గూట్లనే ఒక్క పాటై ప్రవహిస్తున్న
వాళ్ళు సగటు మనుష్యులూ
సతీపతులు..!
అయితే..
దంపతులిరువురికీ ఉద్యోగాలు
అది వాళ్ళ భాగ్యం వాళ్ళ నైపుణ్యం
వాళ్ళకే.. డబుల్ ధమాకా..!
కొండ మీది కోతినైనా,
కొటారు కొమ్మన మిఠాయినైనా
ఉన్న ఫలంగా తెచ్చుకునే సత్తా వీళ్ళ సొంతం
ఒక్కిల్లూ.. రెండింటి భత్యాలూ
రెండ్రెండు ఫలాలు రెండ్రెండు వరాలు
కార్లు జోర్లు షికార్లూ..సరే
అయితే..
బదిలీల్లో వెసులుబాట్లు స్పెషల్ పాయింట్లు..
వీళ్ళకే ఎందుకంటా..!?
కోరుకున్న ఊర్లు నగర నివాసాలు
వీళ్ళ ఆవాసాలు..!
మూడు పువ్వులు ఆరు కాయలన్న నానుడి
వీళ్ళను చూసి పుట్టించిందే..!
మరి నాలాంటోళ్ల మాటో..!?
ఒంటి చేతి నౌకరి నాన్ స్పౌజ్ కేటగిరి
జీరో పాయింట్లు
వెరసి మిగిలిపోయిన మాన్యాలే మా గతి
ఇక మా ఇంటోళ్ళకు..
ఊరూరికి మొయ్యలేని ఓ ఎకురం యెవుసం..!
తప్పదు కదా
నేనే ఆసు పోసినట్టు ఆఫీసుకీ ఇంటికీ
తిరిగే గానుగెద్ధుని..
తెచ్చుకున్న సింగిల్ శాలరీ
ఎగజల్లిన పేలాల్లా ఎప్పుడో ఆవిరీ...
ఒక్కడుగు ముందుకూ,
రెండడుగులు వెనక్కు నా ప్రయాణం
ఎప్పటికీ చేరుతానో గమ్యం
గొర్రెతోక బెత్తెడే అంటే ఏమో అనుకున్నా ..!
పిల్లలు జెల్లలు
ముసలోళ్ళు ముడిగోళ్ళ నాకూ ఉన్నారు
ఇప్పుడు చెప్పండి..
బలహీనులకే తప్పా
బలమున్నోళ్ళకెందుకు కేటాయించాలో
వెసులుబాట్లు,
అనవసరపు పాయింట్లు..!?
ఎండిన చేల మీద చినుకులు రాలాలి గానీ
నిండు జలాశయాల్లో కుండపోత లేలనో..!?
ఆలోచించండి మిత్రులారా..!
అడగందే అవ్వైనా పెట్టదట బువ్వ..!!
- నాంపల్లి సుజాత, 9848053893