Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు
- 16వ వార్డు ఇందిరమ్మ కాలనీలో బస్తీ
- దవాఖాన ప్రారంభించిన మంత్రి
నవ తెలంగాణ-సిద్దిపేట
'మంచినీళ్ల తెలంగాణ.. హరిత తెలంగాణ పూర్తయింది. ఇకా ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా పని చేస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పట్టణంలోని 16వ వార్డు ఇందిరమ్మ కాలనీలో బస్తీ దవాఖానను జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల, డీఎం అండ్ హెచ్‌వో డాక్టర్ కాశీనాథ్‌తో కలిసి రాష్ట్ర ఆర్థిక,వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణులకు పంపిణీ చేసేందుకు ముద్రించిన ఇన్విటేషన్ కార్డులను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేసుకోవాలని కోరారు. పట్టణ ప్రాంతంలోని పేదలకు ఉచిత నాణ్యమైన ప్రభుత్వ వైద్యం అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనతో బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామన్నారు. ఇందిరమ్మ కాలనీలో పట్టు పరిశ్రమ కోసం కేటాయించిన భవనం నిరుపయోగంగా బూత్ బంగ్లాగా మారిందని, ప్రజల వైద్య సేవల కోసం తీర్చిదిద్దడం జరిగిందని తెలిపారు. బస్తీ దావఖానాల సేవలను ఉపయోగించుకోవాలన్నారు. 158 రకాల మందులు, 133 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తారన్నారు. ఆదివారం కూడా ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పని చేస్తాయని తెలిపారు. ప్రజలందరూ బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో మంత్రి హరీశ్‌రావు సహకారంతో రూ.10 కోట్లతో 76 కొత్త హెల్త్ సబ్ సెంటర్లు, 90 హెల్త్ సబ్ సెంటర్లకు మరమ్మతు చేశామన్నారు. అంతకు ముందు 17వ వార్డులో నెహ్రు పార్క్ సమీపంలో కార్మిక సంఘ భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు రాజనర్సు, మల్లికార్జున్, సత్తన్న, విజేందర్ రెడ్డి, పాల్గొన్నారు.
సిద్దిపేట ప్రజలే నా బలం
నవతెలంగాణ-సిద్దిపేట
'సిద్దిపేట నాడు ఉద్యమానికి నేడు అభివృద్ధికి మార్గదర్శనం. ప్రజలే నా బలం. నా శక్తి' అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పట్టణంలో నీలకంఠెశ్వర ఆలయం ప్రాంగణంలో సమాజం వారు నిర్మించిన ధ్యాన మందిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఏళ్ల శ్రమ ఫలితం ఈ ధ్యానమందిరం భవనమన్నారు. నీలకంఠ సమాజంలో అందరూ కలిసిమెలిసి ఉంటారన్నారు. ప్రభుత్వ సహకారంతో పాటు సమాజ సభ్యుల కృషితో ఆలయాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. కోమటి చెరువును పర్యాటక కేంద్రంగా, రంగనాయక చెరువును రూ.100 కోట్లతో అభివృద్ధి చేయబోతున్నామన్నారు. సిద్దిపేట అభివృద్ధిని ఓర్వలేక కొందరు మాటలు అంటున్నారని తెలిపారు. సహాయం కోసం వచ్చిన వారికి కాదు అనకుండా సేవ చేసే అదృష్టం ఇవ్వాలని ప్రతిరోజు దేవున్ని ప్రార్థిస్తానని చెప్పారు. కంటి వెలుగు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని, ఉచితంగా కంటి వైద్య పరీక్షలు పొందండిని సూచించారు.
సేవాలాల్‌కు నివాళి
సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్ర పటానికి పూల మాల వేసి, సేవాలాల్ మహరాజ్ సేవలను మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. ప్రతి గిరిజన గ్రామ పంచాయతీకి భవన నిర్మాణం కోసం రూ.20 లక్షల చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. హుస్నాబాద్‌లో రూ.2 కోట్లతో బంజారా భవన్ నిర్మిస్తున్నామన్నారు. రాబోయే నెల రోజుల్లో పోడు భూములకు పట్టాలు అందిస్తామన్నారు. పట్టణంలోని 2వ వార్డు లో కెమిస్ట్ డ్రగ్గిస్ట్ భవన్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేటలో అన్ని కులాలను గౌరవించి స్థలం ఇప్పించి భవనాలు కట్టించామని, 15 సంవత్సరాల క్రితం ఎల్ఐసి ఎజెంట్లకు, 10 సంవత్సరాల క్రితం ఆర్ఎంపి లకు ఇలా అన్ని సంఘాలకు భవనాలను కట్టించామని అన్నారు. భవిష్యత్తులో ఏ జిల్లాలోనైన అధికారులు ఉదేశ్యపూర్వకంగా ఇబ్బంది పెడితే నా దగ్గరికి రండి అని, సంపూర్ణ మద్దతు ఇస్తా అని తెలిపారు. రాష్ట్రంలో ఆకలి కేకలు లేవని, కరువు కాటకాలు లేవని, దక్షణ భారతదేశనికి మొత్తానికి అన్నం పెట్టే విధంగా రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి చెందిందని అన్నారు. తలసరి ఆదాయం పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.