Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్నీ లీకేజీలు, ప్యాకేజీలే
- బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ-హన్మకొండ
లీకేజీలకు కారణమైన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును వెంటనే రద్దు చేసి కొత్తగా బోర్డును ఏర్పాటు చేసిన తరువాతనే మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని బి యస్ పి రాష్ట్ర అధ్యక్షుడు డా. అర్ యస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ బరోసా యాత్రలో భాగంగా సోమవారం బీఎస్పీ ఆధ్వర్యంలో కాకతీయ యునివర్సిటీ లో పర్యటించారు. పిమ్మట ఎన్పీడీసీఎల్ ప్రాంగణంలో నిరసన కార్యక్రమం చేపట్టిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంఘీభావం తెలిపిన అనంతరం వరంగల్ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 2009 తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ లో ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని పోరాటాల పురిటి గడ్డ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఉద్యమాన్ని కొనసాగించారని వారి ఉద్యమ ఫలితంగానే నేడు ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి వినరు భాస్కర్, నన్నపనేని నరేందర్, ఆరూరి రమేష్ లు మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యారని గుర్తు చేశారు. అలాంటిది ఎంతో కష్టపడి టిపిఎస్‌సి పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులు పేపర్ లీకేజీల కారణంగా ప్రభుత్వంపై ఉద్యమానికి సిద్ధపడితే ఎర్రబెల్లి దయాకర్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి ల ప్రోత్బలంతో కేయూవిసి తాటికొండ రమేష్ పోలీసులను విద్యార్థుల మీదికి ఉసిగొల్పి రాత్రి మూడు గంటలకు హాస్టల్ గదిలో ఉన్న విద్యార్థులను తలుపులు బద్దలు కొట్టి అక్రమ కేసులు బనాయించి జైల్లో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనురాగ్ యూనివర్సిటీ పేరుతో విద్యను అమ్ముకుంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కి యూనివర్సిటీకి వచ్చే అర్హత లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను తొలగించి విద్యార్థులను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో 1,92,000 ఉద్యోగాలు ఉంటే కుట్రపూరితంగా వాటిని కుదించి టిపిఎస్‌సి ద్వారా 30 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ లు ఇచ్చారని తెలిపారు .పారదర్శకంగా ఏర్పాటు చేయవలసిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో టిఆర్ఎస్ పార్టీ నాయకులకు, రాష్ట్ర మంత్రి బావ ప్రొఫెసర్ లింగారెడ్డి , కారం రవీందర్ రెడ్డి లాంటి వారిని నియమిస్తే గ్రూప్ వన్ కు చెందిన 15 పేపర్లు లీకయ్యాని అంటున్నారని అవి లీకులు కాదని కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ కస్టడీలో ఉండవలసిన పరీక్ష పేపర్లు నల్ల బజార్లో ఎలా వచ్చాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. తెలంగాణ పాలన చూసి ఆంధ్ర ప్రజలు నవ్వుకుంటున్నారని కుటుంబ పాలనలో పేపర్ లీకేజీలు , లిక్కర్ ప్యాకేజీలే ఆని ఎద్దేవ చేశారు . మహారాష్ట్ర నేతలు ప్రగతిభవన్‌లో చేరితే వారితో మాట్లాడుతున్నారని ఎన్నో లక్షల మంది ఆధారపడిన టిపిఎస్‌సి పరీక్షలపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా టీపీఎస్సీ పరీక్షలకు సంబంధం లేని మంత్రి కేటీఆర్ కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సమాధానం చెప్పాలన్నారు. పేపర్ లీకేజీల కారణం చిన్న తలకాయలు కాదని పెద్ద తలకాయలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హవాలా డబ్బుతో పేపర్ల అమ్మకం జరిగిందని దీనిపై ఈడిచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై భారత రాష్ట్రపతికి కూడ లేఖ వ్రాసినట్టు తెలిపారు. కెసిఆర్ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలన్ని నిర్వీర్యం చేస్తున్నాడని ఈ తొమ్మిదేళ్లలో ఒక్క యూనివర్సిటీలో కూడా అడుగుపెట్టలేదని అన్నారు. తెలంగాణలో విశ్వవిద్యాలయ పరిరక్షణకు ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఉత్తర తెలంగాణలో అతిపెద్ద ఎన్పీడీసీఎల్ లో 2503 జూనియర్ లైన్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని 2018 నుండి ఇంతవరకు వాటిని భర్తీ చేయలేదని వారం రోజుల్లో జూనియర్ లైన్మెన్ పోస్టులను ప్రకటించాలని డిమాండ్ చేశారు.